కిడ్నీ వ్యాపారం పైనే 'శ్రద్ధ'

10 May, 2019 11:42 IST|Sakshi
శ్రద్ధ ఆస్పత్రిలో రికార్డులు తనిఖీ చేస్తున్న పోలీసులు

బాధితుడి ఫిర్యాదుతో గుట్టు రట్టు

అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారంతో వార్తల్లోకెక్కిన శ్రద్ధ ఆస్పత్రి

బోకర్ల ద్వారా కిడ్నీ అమ్మకాలు, మార్పిడులు

ఒక వైద్యుడు, బ్రోకర్‌ అరెస్టు

శ్రద్ధ ఆస్పత్రి కేంద్రంగానే దందా

ఆస్పత్రిలో పోలీసుల విచారణ

సాక్షి, విశాఖపట్నం: ఆ ఆస్పత్రికి కాసుల వర్షం కురిపించే కిడ్నీ మార్పిడిపైనే అత్యధిక ‘శ్రద్ధ’! లక్షలాది రూపాయలు వచ్చి పడుతుండడంతో యాజమాన్యం అడ్డదారులు తొక్కింది. ఏళ్ల తరబడి ఇదో వ్యాపారంగా పెట్టుకుని ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. కాలం కలిసిరాక ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయింది. విశాఖలో కిడ్నీ మార్పిడికి కేంద్రం ముసుగులో కిడ్నీ రాకెట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది..!

డొంక కదిలిందిలా..
హైదరాబాద్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు పార్థసారథి తన కిడ్నీని రూ.12 లక్షలకు అమ్ముకున్నా రూ.5 లక్షలే ఇచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగరంలోని కలెక్టరేట్‌ వద్ద ఉన్న శ్రద్ధ ఆస్పత్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ ఈ ఆస్పత్రిలో జరుగుతున్న కిడ్నీ మార్పిడులపై ఎవరూ దృష్టి సారించలేదు. ఒక కిడ్నీ మార్పిడికి రోగి నుంచి రూ.60 – రూ.70 లక్షలు వసూలు చేస్తుంటారు. ఇందులో విధిలేక కిడ్నీని అమ్ముకున్న అభాగ్యులకు రూ.12 నుంచి రూ.15 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నా ఐదారు లక్షలే ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ ఆస్పత్రి యాజమాన్యంపై గానీ, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిపై గానీ ఫిర్యాదు చేసే సాహసం ఈ అభాగ్యులు చేయలేరు. ఇదే ‘శ్రద్ధ’కు వరంగా మారింది.

దేశవ్యాప్తంగా బ్రోకర్లు
శ్రద్ధ ఆస్పత్రికి రాష్ట్రంతోపాటూ ఇతర రాష్ట్రాల్లోనూ బ్రోకర్లున్నారు. వీరు కిడ్నీ ఎవరికి అవసరం? ఎవరిస్తారు? వంటి వాటిపైనే దృష్టి సారిస్తారు. అలా దొరికిన వారితో ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుడు (నెఫ్రాలజిస్టు)కు బ్రోకర్లు పరిచయం చేసి బేరం కుదురుస్తారు. ఇలా శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యానికి దేశంలోని వివిధ ప్రాంతాల బ్రోకర్లతో లింకులున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. తాజాగా వెలుగు చూసిన పార్థసారథి వ్యవహారంలో పోలీసులకు అశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడయినట్టు సమాచారం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో విశాఖకంటే మెరుగైన, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు ఎన్నో ఉన్నా... అంతగా పేరు ప్రఖ్యాతల్లేని విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రికే కిడ్నీ మార్పిడి కేసులు పెద్ద సంఖ్యలో వస్తుండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏడాదికి 10 నుంచి 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ఈ ఒక్క ఆస్పత్రిలోనే జరుగుతున్నాయని తెలుసుకుని పోలీసులు నివ్వెరపోతున్నారు. అందుకే ఇప్పుడు ఇలా ఎవరెవరు కిడ్నీ మార్పిడులు చేయించుకున్నారు? వారికి కిడ్నీలు ఎవరిచ్చారు? ఎంత చెల్లించారు? వారితో ఎవరికైనా వివాదాలు తలెత్తాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

నిర్వాహకులకు మద్దతుగా అధికార పార్టీ నేత!
ఇప్పటికే ఈ కిడ్నీ రాకెట్‌ కేసులో ఈ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ ప్రభాకర్‌ను, బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న బెంగళూరుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు మంజునాథ్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేడో రేపో ఆస్పత్రి నిర్వాహకులను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. దీంతో వీరు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ఆస్పత్రి యాజమాన్యం అధికార పార్టీ ‘ముఖ్య’ నేతతో సత్సంబంధాలున్నాయని, అటు నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. శ్రద్ధ ఆస్పత్రి కిడ్నీ రాకెట్‌ బాగోతం వెలుగులోకి రావడంతో విశాఖ నగరంలో ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్న ఇతర కార్పొరేట్‌ ఆస్పత్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పార్థసారథిలాంటి బాధితులుంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరడంతో అలాంటి వారెవరైనా ఫిర్యాదు చేస్తారేమోనని ఈ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.

మరిన్ని వార్తలు