శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

18 Jul, 2018 17:19 IST|Sakshi
శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీ

హైదరాబాద్‌: కళాశాల యాజమాన్యం వేధింపులకు మరో విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కళాశాల మూడవ అంతస్తు నుంచి కిందకు దూకినా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. సెల్‌ఫోన్‌ తీసుకు వచ్చిందన్న నెపంతో అవమానపాలు చేసిన అధ్యాపకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కళాశాల భవనంపై నుంచి కిందకు దూకిన సంఘటన కలకలం రేపింది. వివరాలు.. కుత్భుల్లాపూర్‌ సర్కిల్‌ ఐడీపీఎల్‌ చౌరస్తా సమీపంలోని ఏపీహెచ్‌బీ కాలనీలోని శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో రోడామేస్త్రీ నగర్‌కు చెందిన ఎండీ ముస్కాన్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కొంతమంది విద్యార్థులు దొంగచాటుగా సెల్‌ఫోన్‌లు తమ వెంట తీసుకువస్తున్నారని గ్రహించిన అధ్యాపక బృందం విద్యార్థునులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో పలువురి వద్ద మొబైల్‌ ఫోన్‌లు లభించాయి.

విద్యార్థిని ముస్కాన్‌ వద్ద కూడా ఫోన్‌ను లాక్కున్నారు. దీనిని అవమానభారంగా భావించిన ముస్కాన్‌ అకస్మాత్తుగా మూడవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని విద్యార్థులు అధ్యాపకులకు తెలపగా హుటాహుటిన విద్యార్థినిని స్థానికంగా ఉన్న సంధ్య ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి తీవ్రంగా ఉండటంతో బాలానగర్‌లోని బీబీఆర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై కళాశాల డీన్‌ నాగేశ్వర రావును వివరణ కోరగా ఈ విషయంలో కళాశాల సిబ్బంది తప్పులేదని, రోజువారీ తనిఖీల్లో భాగంగానే సోదాలు నిర్వహించామని, విద్యార్థిని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

అనుమానాలెన్నో..
మొబైల్‌ విషయంలోనే అవమానంగా భావించి ముస్కాన్‌ మూడవ అంతస్తు నుంచి దూకిందని కళాశాల ప్రతినిథులు చెబుతుండగా..మరో వైపు సిబ్బంది మాత్రం ఆమె ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి వెళ్లే క్రమంలో విద్యార్థులు ఒకరికొకరు తోసుకోవడంతో మెట్లపై నుంచి జారిపడిందని చెబుతున్నారు. ఇదే విషయమై ముస్కాన్‌ సోదరుడు జుబేర్‌ను ‘సాక్షి’  అడుగగా..మా చెల్లెలికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, మొబైల్‌ కూడా ఆమె వద్ద లేదని పేర్కొంటున్నాడు. బీజేపీ కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్‌, రాష్ట్ర కన్వీనర్‌ బక్క శంకర్‌ రెడ్డిలు బీజేవైఎం నాయకులతో కలిసి కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు.

మరిన్ని వార్తలు