టీచర్‌ ప్రాణం తీసిన శిక్షణ!

11 May, 2019 13:12 IST|Sakshi
మృతి చెందిన సుధారాణి

వేసవి సెలవుల్లోనూ టీచర్లకు శిక్షణ ఇస్తున్న ‘శ్రీచైతన్య’

అస్వస్థతకు గురై గర్భిణి మృతి

రెండు రోజుల క్రితం ఘటన

బాధితురాలిది అనంతపురం

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రైవేటు టీచర్ల సంఘం ధర్నా

కర్నూలు సిటీ: ఆరోగ్యం సరిగా లేదు...శిక్షణకు రాలేనని ఓ ప్రైవేటు ఉపాధ్యాయిని యాజమాన్యా నికి విన్నవించింది. ఆమె గర్భిణి అయినా యాజమాన్యం కనికరించలేదు. దీంతో అనారోగ్యంతోనే ఎండలో శిక్షణ హాజరై ప్రాణాలు కోల్పోయింది.  నగర శివారులోని కట్టమంచి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవే టు టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకుల కథనం మేరకు వివరాలి లా ఉన్నాయి.  శ్రీచైతన్య విద్యాసంస్థ తమ ఉపాధ్యాయులకు నగర శివారులోని కట్టమంచి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం కోర్టు రోడ్డులోని శ్రీచైతన్య పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్న సుధారాణి (28) హాజరైంది.

ఆమె మూడు నెలల గర్భిణి. దీనికితోడు అనారోగ్యంగా ఉండడంతో తాను శిక్షణకు రాలేనని చెప్పినా నిర్వాహకులు వినలేదు. కచ్చితంగా హాజరుకావాలని చెప్పడంతో చేసేది లేక శిక్షణకు వచ్చారు. బుధవా రం రాత్రి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అబార్షన్‌ అయ్యి రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ప్రైవేటు టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు శుక్రవారం శిక్షణ కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో శిక్షణ ఎ లా నిర్వహిస్తారని సంఘం రాష్ట్ర కన్వీనర్‌ చాంద్‌బాషా ప్రశ్నించారు. ఆరోగ్యం సరిగా లేదని చెప్పినా దుర్మార్గంగా వ్యవహరించిన శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. అడ్మిషన్లు, వర్క్‌షాప్‌ పేరుతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాలో నాయకులు చక్రపాణిరెడ్డి, నాగరాజు, మహేష్, ప్రసాద్, వీరేష్, హనుమంతురెడ్డి పాల్గొన్నారు. 

 ధర్నా చేస్తున్న  ప్రైవేటు టీచర్ల సంఘం నాయకులు

మరిన్ని వార్తలు