‘దండుపాళ్యం’ ప్రేరణ.. కన్ను పడిందంటే కాటికే..!!

28 Feb, 2019 08:41 IST|Sakshi

ఇప్పటి వరకు  14 అత్యాచారాలు.. 4 హత్యలు

శ్రీధరణి హత్యతో వెలుగులోకొచ్చిన సైకో సీరియల్‌ కిల్లర్‌ ఉదంతం

సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద జరిగిన తెర్రి శ్రీధరణి(18) హత్యోదంతంలో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. దండుపాళ్యం సినిమాతో ప్రభావితమైన కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరు రాజు సైకోగా మారాడని.. ప్రేమ జంటలపై దాడులు చేస్తూ సీరియల్‌ కిల్లర్‌గా అవతరించినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు 14 మంది యువతులపై అత్యాచారాలు చేశాడని పోలీసులు తెలిపారు. వారిలో నలుగురిని అత్యాచారం అనంతరం రాజు దారుణంగా హత్యచేసినట్టు వెల్లడించారు.

కన్ను పడిందంటే కాటికే..
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతిని రాజు పెళ్లి చేసుకున్నాడు. 6 నెలల క్రితం జి.కొత్తపల్లికి మకాం మార్చాడు. జీడితోటలకు కాపలాదారుడుగా ఉంటూ అక్కడి అటవీ ప్రాంతంలో పక్ష్లులను, జంతువులనూ వేటాడుతుంటాడు. ఈ క్రమంలో తారసపడ్డ ప్రేమజంటల్ని బెదిరించి డబ్బు వసూలు చేస్తాడు. యువతిపై కన్నుపడిందంటే డబ్బులిచ్చినా తీసుకోడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి ఒడిగడుతాడు. ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తాడు. (ప్రేమికులే వాడి టార్గెట్‌)

చనిపోయాడనుకుని..
గత ఆదివారం గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద హత్యకు గురైన శ్రీధరణిని కూడా తీవ్రంగా గాయపరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీధరణి, ఆమె ప్రియుడు దౌలూరి నవీన్‌ బౌద్ధారామాల వద్ద తారసపడడంతో వారిని బెదిరించి డబ్బు వసూలు చేశాడు. అనంతరం వారిపై దాడికి దిగాడు. తలపై బలంగా మోదడంతో నవీన్‌, శ్రీధరణి స్పృహతప్పి పడిపోయారు. కాసేపటికి శ్రీధరణి నేలపై పాక్కుంటూ తప్పించుకోవాలని చూడడంతో ఆమె కాళ్లు విరిచేశాడు. అనంతర అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో యువతి మరణించింది. నవీన్‌ కూడా చనిపోయాడు అనుకుని రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం నవీన్‌ ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తలపై 40 కుట్లు వేశారు.


దౌలూరి నవీన్, మృతి చెందిన తెర్రి శ్రీధరణి

ఒక్క కేసుకూడా లేదు..
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ధరణిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్‌ తీసుకుని వెళ్లిపోయిన రాజు, నేరుగా జి.కొత్తపల్లిలోని అత్తవారి ఇంటికి చేరుకున్నాడు. మృతురాలి ఫోన్‌లోని సిమ్‌ కార్డును తీసి పడేసి, తన సిమ్‌ కార్డును వేసి ఫోన్‌ను వాడటం మొదలు పెట్టాడు. ఆ ఫోన్‌ను అమ్ముతానంటూ  ఒక సెల్‌ షాపు వద్దకు వెళ్లగా, వ్యాపారి ఫోన్‌ కొనేందుకు నిరాకరించాడు. మొబైల్‌ డంపింగ్‌​ పరిజ్ఞానంతో రాజును గుర్తించారు. పోలీసుల విచారణలో తొలుత రాజు సహకరించలేదు. అయితే, తమదైన శైలిలో మరోసారి ప్రయత్నించడంతో ఈ సీరియల్‌ కిల్లర్‌ తను చేసిన నేరాల చిట్టా విప్పాడని పోలీసులు చెప్పారు. కాగా, ఇంతవరకు రాజుపై ఒక్క కేసుకూడా నమోదు కాకపోవడంపై పోలీసులు దిగ్భాంతి చెందారు. జీలకర్ర గూడెంలో శ్రీధరణి హత్య నాలుగోది. అంతకు ముందు నూజివీడు, మైలవరం, మచిలీపట్నంలలో మరో ముగ్గురు యువతులను రాజు అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 

మరిన్ని వార్తలు