ఎన్‌ఐఏ అదుపులోకి శ్రీనివాసరావు

13 Jan, 2019 03:59 IST|Sakshi
విజయవాడ జైలు నుంచి శ్రీనివాస్‌ను విచారణకు తీసుకెళుతున్న ఎన్‌ఐఎ పోలీసులు

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు

అనంతరం హైదరాబాద్‌కు తరలించిన అధికారులు

అక్కడ నుంచి విశాఖకూ తరలింపు?

న్యాయవాది సమక్షంలో నిందితుడి విచారణ

సాక్షి, అమరావతి బ్యూరో/లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జె. శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శనివారం తమ అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ జగన్‌పై దాడి కేసు దర్యాప్తును హైకోర్టు ఆదేశాలతో చేపట్టిన ఎన్‌ఐఏ.. నిందితుడిని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ శుక్రవారం విజయవాడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం విజయవాడ జిల్లా జైలులో ఉన్న శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించి అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.నాంచారయ్య పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికను అధికారులకు డాక్టర్ల బృందం అందజేసింది. కాగా, అవసరమైతే నార్కో ఎనాలసిస్‌ పరీక్షలకైనా తాను సిద్ధమేనని నిందితుడు చెప్పినట్లు అతని తరఫు న్యాయవాది సలీం జైలు వద్ద మీడియాకు తెలిపారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. 

విశాఖకు నిందితుడి తరలింపు?
నిందితుడు శ్రీనివాసరావును ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. ఎన్‌ఐఏ అధికారులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు.. విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు శనివారం రాత్రి నిందితుడ్ని విశాఖకు తీసుకొస్తున్నట్లు అక్కడి పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి చెప్పారు. కానీ, రాత్రి వరకు అతనిని తీసుకురాలేదు. దీంతో శనివారం అర్థరాత్రి తర్వాత లేదా ఆదివారం ఉదయానికి తీసుకొస్తారని సమాచారం. విమానాశ్రయంలో టీడీపీ నేత హర్షవర్థన్‌ చౌదరికి చెందిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌తో పాటు వీవీఐపీ లాంజ్‌లోకి నిందితుడ్ని తీసుకెళ్లి, ఘటన జరిగిన తీరుతెన్నులను ఎన్‌ఐఏ అధికారులు పరిశీలిస్తారని తెలుస్తోంది. 

>
మరిన్ని వార్తలు