ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై వికృత చేష్ట..

23 Nov, 2018 10:17 IST|Sakshi

సాక్షి, చెన్నై : ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ క్యాంపస్‌ హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్‌ విద్యార్ధినిపై జరిగిన లైంగిక వేధింపుల పట్ల వర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని పేర్కొంటూ గురువారం రాత్రి విద్యార్ధులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. బాధిత విద్యార్ధిని ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై విద్యార్ధులు భగ్గుమన్నారు.

వర్సిటీలో ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని గురువారం మధ్యాహ్నం హాస్టల్‌ లిఫ్ట్‌లో వెళుతుండగా, లిఫ్ట్‌లోనే ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు జననాంగం చూపుతూ ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో ఆమె అధికారులకు  ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా హాస్టల్‌ వార్డెన్‌ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించేందుకు మూడు గంటలు జాప్యం చేశారన్నారు.

నిందితుడిని గుర్తించినా పోలీసులకు ఫిర్యాదు చేయడంలో తాత్సారం చేశారని మండిపడ్డారు. బాధిత విద్యార్థిని జరిగన ఘటనపై మౌనంగా ఉండాలని వర్సిటీ అధికారులు ఒత్తిడి తెచ్చారని విద్యార్ధులు చెబుతున్నారు. విద్యార్థిని ఫిర్యాదుపై వర్సిటీ యంత్రాంగం చర్యలు చేపడుతుందని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వీసీ సందీప్‌ సంచేటి తెలిపారు. మరోవైపు వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు