స్టాఫ్‌ నర్సు అనుమానాస్పద మృతి

10 Jul, 2018 11:56 IST|Sakshi
నాగమణి మృతదేహం

బాత్‌రూమ్‌లో విషం తాగి చనిపోయినట్లు పోలీసుల నిర్థారణ

పనిచేస్తున్న ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే అని బంధువుల ఆరోపణ

పెదవాల్తేరు(విశాఖతూర్పు): నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ట్రైనీ స్టాఫ్‌నర్సు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చనిపోయిన యువతి తల్లిదండ్రులు, బంధువులు మాత్రం ఆ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపిస్తున్నారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన నింపు అప్పారావు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమార్తె నాగమణి (28) నాలుగు నెలల క్రితం రామ్‌నగర్‌లో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రైనీ స్టాఫ్‌నర్సుగా విధుల్లో చేరింది. ఆమె ఆస్పత్రిలో పనిచేస్తూ, రామ్‌నగర్‌లో గల బాలాజీ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటోంది. ఆ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఒక ఎమర్జెన్సీ కేసు ఉందని ఆస్పత్రి నుంచి ఫోన్‌ రావడంతో నాగమణి వెళ్లింది. తిరిగి ఆమె ఉదయం 11 గంటల సమయంలో హాస్టల్‌కి చేరుకుంది.

అనంతరం బాత్‌రూమ్‌కు వెళ్లి మళ్లీ రాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సహచర యువతులు బాత్‌రూమ్‌కు వెళ్లి తలుపు తీయగా లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో తెరుచుకోలేదు. ఒక యువతి వెనుక గల మరో బాత్‌రూమ్‌లో నుంచి మొబైల్‌ ఫోన్‌  కెమెరాతో చూడగా నాగమణి విగతజీవిగా పడిపోయి ఉంది. వెంటనే తలుపులు విరగ్గొట్టి హుటాహుటిన ఆ యువతి పనిచేస్తున్న ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. అయితే అప్పటికే చనిపోయి ఉందని వైద్యులు తేల్చారు. ఈ విషయాన్ని ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఆస్పత్రి యాజమాన్యం యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు బంధువులతో కలిసి నగరానికి చేరుకున్నారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే నాగమణి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు మూడో పట్టణ పోలీసులకు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ ఇమ్మానియేల్‌రాజు పర్యవేక్షణలో ఎస్‌ఐ బి.రమణయ్య సెక్షన్‌ – 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్పత్రిలో ఏం జరిగింది...?
నాగమణి ఎమర్జన్సీ కేసు నిమిత్తం ఆదివారం ఆస్పత్రికి వెళ్లినపుడు అక్కడ సిబ్బంది లేదా వైద్యులెవరైనా ఆమెని వేధింపులకు గురి చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగమణికి ఇంట్లో  సమస్యలు లేవని, ఎవరితోనూ ప్రేమ వ్యవహారాలూ లేవని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

హాస్టల్‌కి ఉదయం 11 గంటలకు వచ్చిన నాగమణి బాత్‌రూమ్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాకపోయినా తోటి యువతులు, హాస్టల్‌ సిబ్బది పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నాగమణి బాత్‌రూమ్‌లో విషం తాగి చనిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం బాలాజీ లేడీస్‌ హాస్టల్‌తోపాటు, యువతి పనిచేసిన ఆస్పత్రిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నాగమణి మృతదేహాన్ని సోమవారం సాయంత్రం కేజీహెచ్‌కి తరలించారు.

మరిన్ని వార్తలు