‘స్టార్‌’ చోర్‌ జయేష్‌ బాగోతం

22 Mar, 2018 08:09 IST|Sakshi
జయేష్‌ రావ్‌జీ

రూ.10 లక్షల ఆభరణం రూ.1.8 లక్షలకే

ముంబైలో విక్రయించినట్లు అంగీకరించిన జయేష్‌   

లోతైన విచారణ కోసం కస్టడీ తీసుకోవాలని నిర్ణయం

ముంబై తరలించి రికవరీకి యత్నం

పీడీ యాక్ట్‌ నమోదుకు సన్నాహాలు

స్టార్‌ హోటళ్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన జయేష్‌ రావ్‌జీ దొంగ సొత్తును ముంబైలో విక్రయిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. నగరంలోని పార్క్‌ హయత్‌ హోటల్‌ నుంచి చోరీ చేసిన సొత్తులో రూ.10 లక్షల విలువైన వజ్రాభరణాన్ని కేవలం రూ.1.8 లక్షలకే ముంబైలోని హిరేన్‌ అనే వ్యాపారికి అమ్మినట్లు పోలీసుల విచారణలో జయేష్‌ వెల్లడించాడు. ఇతడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ముంబైకి తరలించి హిరేన్‌ నుంచి సొత్తు రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే 2014లో అబిడ్స్‌లోని మెర్క్యూరీ హోటల్, 2016లో ఎస్సార్‌ నగర్‌లోని మ్యారీగోల్డ్‌ హోటళ్లలో జరిగిన చోరీ కేసుల్లోనూ జయేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు.   

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలోని పార్క్‌ హయత్‌ హోటల్‌ నుంచి రూ.40 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయిన ‘స్టార్‌ చోర్‌’ జయేష్‌ రావ్‌జీ సెజ్‌పాల్‌ను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.30 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. పోలీసుల విచారణ లో మిగిలిన రూ.10 లక్షల విలువైన వజ్రాల ఆభరణాన్ని ముంబైలో తాకట్టు పెట్టినట్లు అంగీకరించాడు. మంగళవారం అరెస్టు చేసిన నిందితుడిని బంజారాహిల్స్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం జయేష్‌ను తమ కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 10 రోజులు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2003 నుంచి స్టార్‌ హోటళ్లను టార్గెట్‌గా చేస్తూ ముంబైతో పాటు 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో 32 చోరీలు చేసిన జయేష్‌ ఆ సొత్తు మొత్తాన్ని ముంబైలోని బోరేవాలి ప్రాంతానికి చెందిన హిరేన్‌ ఎం.షాకు విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు.

పార్క్‌ హయత్‌ నుంచి చోరీ చేసిన సొత్తులో రూ.10 లక్షల విలువైన వజ్రాభరణాన్ని కేవలం రూ.1.8 లక్షలకే హిరేన్‌కు అమ్మినట్లు తెలిపాడు. ఇతగాడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ముంబైకి తరలించి హిరేన్‌ నుంచి సొత్తు రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. పార్క్‌ హయత్‌తో పాటు 2014లో అబిడ్స్‌లోని మెర్యూ్కరీ హోటల్, 2016లో ఎస్సార్‌ నగర్‌లోని మ్యారీగోల్డ్‌ హోటళ్లలో జరిగిన చోరీ కేసుల్లోనూ జయేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి హిరేన్‌ నుంచి సొత్తును రికవరీ చేయాలని నిర్ణయించారు. భారీ స్థాయిలో చోరీలకు పాల్పడుతున్న జయేష్‌ నుంచి చోరీ సొత్తు ఖరీదు చేస్తున్న హిరేన్‌ పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. మరోవైపు జయేష్‌ అరెస్టు విషయం తెలుసుకున్న కోల్‌కతా పోలీసులు అక్కడి కేసులో పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. 

అతడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2004–05లో ‘స్టార్‌ నేరం’లోనే ఇతగాడు చెన్నై పోలీసులకు చిక్కాడు. అప్పట్లో అక్కడి పోలీసులు ఇతడిపై టీపీడీఏ (తమిళనాడు ప్రివెన్షన్‌ ఆఫ్‌ డేంజరస్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌) ప్రయోగించి 14 నెలలు జైల్లో ఉంచారు. జయేష్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు ముంబై సమీపంలోని థానేలోని ఓ లాడ్జిలో బస చేసి ఉండగా పట్టుకున్నారు. తన వద్ద ఉన్న సొమ్ముతో జల్సా చేస్తున్న ఇతగాడు ప్రస్తుతం నడుస్తున్న టీ–20 ట్రై సిరీస్‌ నేపథ్యంలో బెట్టింగ్స్‌ కాయడంతో బిజీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు ప్రశ్నించినప్పుడు... ‘భారీ మొత్తం బెట్టింగ్స్‌ కాస్తాను సార్‌. అది గేమ్‌ ఆఫ్‌ లక్‌... ఒక్కోసారి డబ్బులు వస్తాయి. అనేకసార్లు పోతాయి. మొత్తమ్మీద బెట్టింగ్స్‌లో నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ’ అంటూ చెప్పినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు