ఎవరా చిన్నారి?

17 Feb, 2018 09:20 IST|Sakshi
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు (ఫైల్‌)

నరబలి కేసులో మిస్టరీగా మారిన శిశువు

బెగ్గింగ్‌ మాఫియా ప్రమేయంపై అనుమానాలు

‘బొటానికల్‌ గార్డెన్‌’ది సాంకేతికంగా డబుల్‌ మర్డరే

ఆ దిశలో కేసు మార్పునకు అవకాశం: నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలి ఠాణా పరిధిలోని బొటానికల్‌ గార్డెన్‌ వద్ద మృతదేహంగా లభించిన గర్భిణి హత్య... ఉప్పల్‌ చిలుకానగర్‌లో వెలుగు చూసిన మూడు నెలల చిన్నారి నరబలి... రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతాలు పోలీసులను పరుగులు పెట్టించాయి. ఈ రెండు కేసులను సైబరాబాద్, రాచకొండ పోలీసులు కొలిక్కి తీసుకువచ్చినా.. ఇంకా కొన్ని ‘మిస్టరీలు’ అలాగే మిగిలిపోయాయి. మరోపక్క ఈ కేసుల్లో ఆసక్తికర అంశాలు, కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘బొటానికల్‌ గార్డెన్‌’ కేసులో హతురాలు పింకి ఫొటో పోలీసులు సేకరించలేకపోయారు. బిహార్‌కు చెందిన ఆ కుటుంబం వద్ద పేదరికం కారణంగా ఒక్క ఫొటో కూడా లేకుండా పోయింది. ఈ ఉదంతంతో ఫొటో మిస్‌ కాగా... నరబలి కేసులో ప్రతాప్‌సింగారం వద్ద మూసీలో పడేసిన కారణంగా చిన్నారి మొండెం గల్లంతైంది. 

అదృశ్యంపై అందని ఫిర్యాదు ?
తన భార్య ఆరోగ్యంతో పాటు ఇతర సమస్యలు తీరడానికి నరబలి ఇవ్వడానికి సిద్ధమైన క్యాబ్‌ డ్రైవర్‌ రాజశేఖర్‌ గతనెల 31 అర్ధరాత్రి దాటిన తర్వాత బోయగూడ నుంచి శిశువును అపహరించాడు. రోడ్డు పక్కనే పడుకున్న దంపతుల నుంచి చిన్నారిని ఎత్తుకు వచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు. ఎవరైనా తమ బిడ్డను కోల్పోతే పోలీసులను ఆశ్రయిస్తారు. కనీసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికే ప్రయత్నమైనా చేస్తారు. అయితే సదరు చిన్నారి అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. రాచకొండ పోలీసులు బోయగూడ వద్ద ఆరా తీసినా ఎవ్వరూ బిడ్డను పోగొట్టుకున్నట్లు వెలుగులోకి రాలేదని తేలడంతోఈ చిన్నారిని బెగ్గింగ్‌ మాఫియా ఎక్కడ నుంచో ఎత్తుకు వచ్చిందనే సందేహాలు కలుగుతున్నాయి. చిన్నారి అదృశ్యమైందని ఫిర్యాదు చేస్తే అసలు కథ బయటకు వస్తుందనే భయంతో ఆ దంపతులు మిన్నకుండినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. 

సిటీ అధికారుల సాయం కోరారా?
రాజశేఖర్‌ శిశువును కిడ్నాప్‌ చేసినట్లు పేర్కొంటున్న బోయగూడ ప్రాంతం హైదరాబాద్‌లోని ఉత్తర మండల పరిధిలోకి వస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి చిన్నారి సంబంధీకులను గుర్తించడానికి, మరికొన్ని ఆధారాలు సేకరించడానికి రాచకొండ పోలీసులు నగర అధికారుల సాయం కోరాల్సిందే. ఉత్తర మండలంలోని అనేక ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. కిడ్నాప్‌ చేసిన ప్రాంతంలో అవి లేకున్నా... అక్కడ నుంచి ఉప్పల్‌ రోడ్‌ వరకు ఉన్న వాటిని అధ్యయనం చేసే ఆస్కారం ఉంటుంది. ఫలితంగా రాజశేఖర్‌ కదలికలకు సంబంధించి మరింత పక్కా ఆధారాలు సేకరించడంతో పాటు శిశువును పోగొట్టుకున్న లేదా బెగ్గింగ్‌ మాఫియాపై వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. మరోపక్క ఉత్తర మండలంలోని పెట్రోలింగ్‌ పోలీసులు ప్రతి రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఫుట్‌పాత్‌లపై ఉన్న వారి వివరాలు ఆరా తీస్తుంటారు. రాచకొండ పోలీసులు వీరిని సంప్రదిస్తే మరికొన్ని ఆధారాలు లభించే ఆస్కారం ఉన్నా పట్టించుకోలేదని సమాచారం. ఒక్క క్లూస్‌ టీమ్‌ విషయంలో మాత్రమే సిటీ నుంచి సహకారం తీసుకున్నారు. 

ఆధారాలు దొరికినా తప్పించుకునే యత్నం...
శిశువును బలివ్వడం, క్షుద్రపూజల వెనుక రాజశేఖర్‌తో పాటు అతడి భార్య శ్రీలత సైతం కీలక పాత్ర పోషించింది. రాజశేఖర్‌ శిశువు తలను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి నగ్న పూజలు చేశారు. రెండు గదులున్న ఆ ఇంటి మధ్యలో తలను ఉంచాలనే ఉద్దేశంతో ఆర్చ్‌ దగ్గర పెట్టి తంతు పూర్తి చేశారు. ఆపై ఆ ప్రాంతాన్ని పూర్తిగా కడిగేశారు. దాదాపు నాలుగు రోజుల క్రితం ఘటనాస్థలిని పరిశీలించిన హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్‌ అధికారులు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న లుమినాల్‌ అనే రసాయనం, జర్మనీ నుంచి ఖరీదు చేసిన సూపర్‌ లైట్‌–ఎంఓ5 వినియోగించి ఆర్చి వద్ద తనిఖీలు చేశారు. ఫలితంగా అక్కడ రక్తం మరకలు ఉన్నట్లు తేలినా.. అవి మనిషివా? వేరే జంతువుకు చెందినవా? అనే సందేహం ఉంది. ఓపక్క దీనిని నిర్థారించడానికి నమూనాలకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. శ్రీలతను ఈ విషయంపై ప్రశ్నించగా గత నెల 24న తాము సమ్మక్క పూజ నేపథ్యంలో కోడిని బలిచ్చామంటూ చెప్పి తప్పించుకోజూసింది. చివరకు ఫోరెన్సిక్, డీఎన్‌ఏ రిపోర్టులు అసలు నిజాలు బయటపెట్టి భార్యభర్తల్ని కటకటాల్లోకి పంపాయి.

ముందే చెప్పిన ‘సాక్షి’...
ఉప్పల్‌లోని చిలుకనగర్‌ చిన్నారి కేసులో రెండు అంశాలు ‘సాక్షి’ ముందే చెప్పింది. ఈ ఉదంతం ఈ నెల 1న వెలుగులోకి వచ్చింది. అదే రోజు ఘటన పూర్వాపరాలను పరిశీలించి నరబలిగా అనుమానించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ‘నగరంలో నరబలి?’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇది జరిగిన పది రోజుల వరకు ఆ చిన్నారి మగ, ఆడ శిశువా అనే స్పష్టత లేదు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్‌ నిపుణుల సాయంతో పోలీసులు ఈ నెల 9న గుర్తించారు. దీనికి సంబంధించి ‘ఆ తల ఆడ శిశువుదే!’ పేరుతో 10న కథనం ప్రచురించింది.  

అది డబుల్‌ మర్డరే..
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని బోటానికల్‌ గార్డెన్‌ వద్ద ముక్కలుగా లభించిన గర్భిణి కేసులో హత్యకు గురైంది ఒక్కరు కాదు ఇద్దరుగా పరిగణించే ఆస్కారం ఉంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) ప్రకారం గర్భిణి హత్యకు గురైన సందర్భాల్లో గర్భస్థ శిశువు వయస్సు ఐదు నెలలకు మించి ఉంటే ఇద్దరు చనిపోయినట్లు పరిగణిస్తారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్‌ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో మొత్తం 17 మంది చనిపోయారు. ఈ కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు  మృతుల్లో ఓ గర్భిణి సైతం ఉండటంతో చనిపోయిన వారి సంఖ్య 18గా నిర్థారిస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. దీని ప్రకారం చూస్తే పింకీ ఉదంతాన్నీ డబుల్‌ మర్డర్‌గా (జంట హత్యలు) తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసు డబుల్‌ మర్డర్‌గా అధికారికంగా పరిగణిస్తే నిందితులకు త్వరగా బెయిల్‌ లభించదని, నేరం నిరూపితమైతే శిక్ష కూడా ఎక్కువ పడే ఆస్కారం ఉందని చెబుతున్న నిపుణులు సైబరాబాద్‌ పోలీసులు ఈ కోణంలో చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు