కంచికి చేరని కథలెన్నో.!

26 Dec, 2018 08:58 IST|Sakshi

ఈ ఏడాదీ కొలిక్కిరాని సంచలనాత్మక కేసులు  

జాడ తెలియని జూబ్లీహిల్స్‌ దోపిడీ ముఠా

కొలిక్కిరాని చిలుకానగర్‌ చిన్నారి నరబలి కేసు

పేట్లబురుజు బంగారు కార్ఖానాలో దోపిడీ కేసు సైతం..  

రిటైర్డ్‌ ఆర్మీ అధికారి ఇంట్లో చోరీ చేసిన నేపాలీల జాడెక్కడ?

మరికొన్ని కేసుల్లో సక్సెస్‌ రేట్‌ కేవలం సగమే.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది... పోలీసింగ్‌ ప్రభావం పెరిగింది... కేసుల దర్యాప్తులో యాప్‌లు సైతం సహకరిస్తున్నాయి... క్లూస్‌ టీమ్స్‌ పరిపుష్టంగామారాయి... వెరసి నగరంలో కేసులు తగ్గుతూ, శిక్షల శాతం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ మిస్టరీగా మిగిలిపోతున్న కేసులు పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి. ఈ ఏడాది చోటు చేసుకున్న భారీ నేరాల్లో అనేకం అపరిష్కృతంగానేమిగిలాయి. మరికొన్ని కేసులు కొలిక్కి వచ్చినా ఫలితం పూర్తి స్థాయిలో లేదు. 2018కి సంబంధించి ఇలాంటి సంచలనాత్మక కేసుల్లో కీలకమైనవి ఇవీ...

సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా గ్రేటర్‌లో జరిగిన పలు కేసుల దర్యాప్తు ముందుకు కదలడం లేదు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్‌ మారినా.. కేసుల దర్యాప్తులో యాప్‌లు, సీసీ కెమెరాలు సమాచారం అందిస్తున్నాయి. క్లూస్‌ టీమ్స్‌ పరిపుష్టంగా మారాక నగరంలో కేసులు తగ్గుతూ, శిక్షల శాతం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ మిస్టరీగా మిగిలిపోతున్న కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఈ ఏడాది చోటు చేసుకున్న భారీ నేరాల్లో అనేకం అపరిష్కృతంగానే మిగిలాయి.

పత్తాలేని జూబ్లీహిల్స్‌ దోపిడీ ముఠా
జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.10లో, పాతబస్తీలో ఈ ఏడాది జనవరిలో విరుచుకుపడిన దోపిడీ ముఠాల గుట్టు వీడలేదు. జూబ్లీహిల్స్‌ బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్‌  కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పని చేస్తున్న యాదగిరిపై జనవరి 4 ఉదయం ముగ్గురు దుండగులు దాడి చేసి వాహనం, సెల్‌ఫోన్లు దోచుకుపోయారు. ఈ ఉదంతం న్యూ సిటీలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో చోటు చేసుకుంది. ఆ మరునాడు ఇదే ముఠా ఓల్డ్‌ సిటీలోని బహదూర్‌పు ప్రాంతంలో పంజా విసిరింది. దోచుకున్న బైక్‌పై అక్కడి ప్రధాన రహదారిలోని ఎస్బీఐ వద్దకు వచ్చిన ముగ్గురు దుండగుల్లో ఇద్దరు వాహనంతో బయటే వేచి ఉండగా... మరొకరు బ్యాంకు లోపలకు వెళ్లి నగదు లావాదేవీలు చేస్తున్న వారిని దాదాపు అరగంటకు పైగా గమనించాడు. ఈ దృశ్యాలు బ్యాంకులో ని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రామ్నాస్‌పురాకు చెందిన విద్యార్థి అబ్దుల్లా రూ.70 వేలు బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసేందుకు రాగా డిపాజిట్లు స్వీకరించే సమయం మించిపోవడంతో అధికారులు నగదు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో అబ్బుల్లా తిరిగి వెళ్తుండగా ఇతడి వెనుకే బ్యాంక్‌ నుంచి బయటకు వచ్చిన దుండగుడు మిగిలిన ఇద్దరినీ కలిశాడు. అనంతరం ముగ్గురూ అతడిని  వెంబడించారు. పాలిటెక్నిక్‌ కళాశాలకు వెళ్లే మలుపు వద్ద అతడిని అడ్డుకుని కత్తితో బెదిరించి నగదు లాక్కునేందుకు ప్రయత్నించారు. అబ్దుల్లా ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకునేలోగా దుండగులు ఫలక్‌నుమ వైపు పారిపోయారు. ఈ రెండు కేసులూ ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు.

ఆ నేపాలీల జాడెక్కడ?
నార్త్‌జోన్‌ పరిధిలో ఉంటున్న ఆర్మీ మాజీ ఉన్నతాధికారి ఇంట్లో దాదాపు రూ.2 కోట్ల సొత్తు చోరీకి గురైంది. ఈ నేరం చేసిన నేపాలీలు ఇప్పటి వరకు దొరకలేదు. గత నెలలో అబిడ్స్‌ పరిధిలోని మరో ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసు కొలిక్కి రాలేదు. మహేష్‌నగర్‌ కాలనీ ఫతేసుల్తాన్‌ లైన్‌లో నివసించే వ్యాపారి సునీల్‌ అగర్వాల్‌ ఇంట్లో నేపాల్‌కు చెందిన దంపతులు పని చేసేవారు. యజమానులు లేని సమయం చూసుకుని, పక్కా పథకం ప్రకారం మరికొందరితో కలిసి పంజా విసిరారు. ఈ కేసులో దాదాపు రూ.కోటి విలువైన సొత్తు దుండగుల పాలైంది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినా ఫలించలేదు. నేపాలీల ఆచూకీ కనిపెట్టడమూ కష్టసాధ్యంగా మారింది.

వాంటెడ్‌గానే అంతర్రాష్ట్ర ముఠా...
పంజగుట్ట ఠాణా పరిధిలో చోటు చేసుకున్న దారి దోపిడీ కేసులో నిందితులుగా ఉన్న అంతరాష్ట్ర ముఠాలో అందరు సభ్యులు చిక్కకపోవడంతో ఆ డబ్బు కూడా రికవరీ కాలేదు. ఈ ఏడాది మేలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. తార్నాక ప్రాంతానికి చెందిన భార్యభర్తలు పద్మ, నర్సింగ్‌రావు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లో ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌లో రూ.2.1 లక్షలు డ్రా చేసుకుని వెళ్తుండగా నల్లరంగు పల్సర్‌పై వచ్చిన దుండగులు బ్యాగ్‌ లాక్కెళ్లారు. దీనిపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను «అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే దుండగులు ఇద్దరు కాదు నలుగురని తేలింది. ముందు వచ్చిన ఇద్దరూ బ్యాగ్‌ లాక్కుని వెళ్లిపోగా... వారి వెనుకే మరో వాహనంపై మరో ఇద్దరు వెంట వెళ్లినట్లు గుర్తించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సమీపంలోని ఓ లాడ్జిలో బస చేసిన వీరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠాగా గుర్తించారు. స్థానిక పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించినప్పటికీ సూత్రధారులు దొరకలేదు. కేవలం  పాత్రధారిని మాత్రమే పట్టుకోగలిగారు. దుండగులు ఎత్తుకుపోయిన నగదూ ఆచూకీ లేకుండా పోయింది.

ఆ చిన్నారి ఎవరో తెలియలేదు...
ఉప్పల్, చిలుకానగర్‌లోని మైసమ్మ దేవాలయం వద్ద వెలుగులోకి వచ్చిన నరబలి కేసులో కొన్ని ప్రశ్నలు అలానే ఉండిపోయాయి. చిలుకానగర్‌ వాసి రాజశేఖర్‌కు క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. కుటుంబంతో సహా మేడారం జాతర వెళ్లడానికి సిద్ధమవుతుండగా అతని అత్త బాలలక్ష్మీ దుస్తులు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లింది. అక్కడ ఓ చిన్నారి తల కనిపించడంతో భయాందోళనకు గురైంది. ఈ విషయం రాష్ట్రంలో దావానలంగా వ్యాపించింది. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు రాజశేఖరే నిందితుడిగా గుర్తించారు. అయితే ఆ చిన్నారి ఎవరు? మొండెం ఎక్కడ ఉంది? తదితర విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

ఆ సొత్తు ఆచూకీ లేదు....
పాతబస్తీ, పేట్లబురుజులోని నిథాయిదాస్‌కు చెందిన బంగారు కార్ఖానాలో జరిగిన భారీ దోపిడీ కేసు సైతం పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు. ముంబైకి చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్‌ తరచూ నిథాయిదాస్‌కు చెందిన కార్ఖానాలకు వచ్చి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన, తాను రూపొందించిన డిజైన్లను చూపించేవాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ  లావాదేవీలు, సెక్యూరిటీ ఏర్పాట్లు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించిన అతను తన స్నేహితుడైన ముంబైలోని థానే వాసి అమ్జద్‌ ఖాజాకు చెప్పాడు. సదరు కార్ఖానాలో బంగారు నగలను ఎక్కడ దాస్తారనేది ఉప్పందించాడు. అప్పటికే దాదాపు 40 దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్న అమ్జద్‌ జ్యువెలరీ డిజైనర్‌ ఇచ్చిన సమాచారంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కార్ఖానాను టార్గెట్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నెలతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో సిటీకి వచ్చి రెండుమూడు రోజుల పాటు రెక్కీ చేసి వెళ్లిన అమ్జద్‌ ముఠా మార్చ్‌లో పంజా విసిరింది. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు అమ్జద్‌తో పాటు మరికొందరిని పట్టుకున్నారు. అయితే జ్యువెలరీ డిజైనర్‌ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. దీంతో పాటు దోపిడీ దొంగలు ఎత్తుకుపోయిన 3.5 కేజీల బంగారు ఆభరణాలు రికవరీ కాలేదు. దీనికోసం పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

ఆమెను చంపింది ఎవరు?
జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన ఓ మహిళ  రెండు రోజులకు ఎస్సార్‌ నగర్‌ లిమిట్స్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో శవమై కనిపించింది. అత్యంత దారుణంగా జరిగిన ఈ హత్య కేసులోనూ నిందితులు ఇప్పటి వరకు చిక్కలేదు. రహత్‌నగర్‌కు చెందిన నర్సమ్మ జూన్‌ 13న కల్లు తాగడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమెను తీసుకురావడానికి అల్లుడు ఆనంద్‌కుమార్‌ ఆటోలో అక్కడికి వెళ్లగా అయితే అప్పటికే నర్సమ్మ వెళ్లిపోయినట్లు తెలుసుకున్నాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఎర్రగడ్డ ఆస్పత్రి ఆవరణలో శవమై కనిపించింది. ఆమె కాళ్లకు ఉన్న వెండి కడియాల కోసం హత్య చేసిన దుండగులు వాటిని తీయడానికి కాళ్లను సైతం నరికేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఆ రోజు నర్సమ్మ మరో మహిళతో కలిసి కల్లు కాంపౌండ్‌ నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఆధారాలను బట్టి మరో పురుషుడూ వీరికి జత కట్టినట్లు తేల్చారు. ఈ ముగ్గురూ ఎర్రగడ్డ ఆస్పత్రి ఆవరణలోకి వచ్చారు. సీన్‌ కట్‌ చేస్తే మరుసటి రోజు నర్సమ్మ శవంగా కనిపించింది. ఈ కేసు మాత్రం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఫలితంగా దారుణంగా హత్య చేసిన వాళ్లు స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు.

మరిన్ని వార్తలు