పట్టుకున్నారు..

7 Apr, 2018 11:59 IST|Sakshi
చందా జనరల్‌ స్టోర్‌ గోడౌన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న సివిల్‌ సప్లయిస్‌ అధికారులు

అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5.62 లక్షల వంటనూనె, పంచదార సీజ్‌

కాకినాడ రూరల్‌:కాకినాడ పట్టణంలోని రాజాజీ వీధిలోని చందా కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5.62 లక్షల విలువైన వంట నూనెలు, పంచదార, వేరుశనగ గుళ్లను సీజ్‌ చేసినట్టు కాకినాడ   పౌరసరఫరాల శాఖ సహాయ అధికారి పీతల సురేష్‌ శుక్రవారం వివరించారు. వ్యాపారులు ఏ డోర్‌ నంబర్‌ పేరుతో గోడౌన్లు రిజిస్టేషన్‌ చేయించుకున్నారో అదే గోడౌన్‌లో సరుకు నిల్వ ఉంచుకోవాల్సి ఉండగా.. చందా కిరాణా షాపు యజమాని కాంతిలాల్‌ చౌదరి ఒక గోడౌన్‌కు అనుమతి తీసుకొని మరో రెండు గోడౌన్‌లకు అనుమతులు లేకుండా వంటనూనెలు, పంచదార, వేరుశనగ గుళ్లు నిల్వ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ గోడౌన్లకు కనీసం లైసెన్సు కోసం దరఖాస్తు చేయలేదన్నారు.

అనుమతులు లేకుండా గోడౌన్‌లో స్టాకులను అక్రమంగా ఉంచినందుకు నిత్యవసర వస్తువుల చట్టం 1955 సెక్షన్‌6ఏ ప్రకారం కేసు నమోదు చేసి జాయింట్‌ కలెక్టర్‌ కోర్టుకు నివేదిక పంపినట్టు తెలిపారు. అనుమతులు లేని గోడౌన్లలో 6785 లీటర్ల వంట నూనెలు, 644 కిలోల పంచదార, 250 కిలోల వేరుశనగ గుళ్లు నిల్వ ఉన్నాయని, వీటి విలువ ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం రూ.5,62,336  ఉంటుందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి బహిరంగ మార్కెట్‌ అధిక ధరలకు విక్రయించేందుకు వీలుగా ఈ అక్రమ నిల్వలు ఉంచినట్టు గుర్తించామని సురేష్‌ తెలిపారు. సీజ్‌ చేసిన స్టాకును అశోక జనరల్‌ స్టోర్స్‌ యజమాని కాంతిలాల్‌జైన్‌కు భద్రత నిమిత్తం అప్పగించినట్టు వివరించారు. వంట నూనెలు, పంచదారకు సంబంధించి లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేసినా సక్రమంగా రికార్డులు రాయకపోయినా, అనుమతిలేని గోడౌన్‌లో నిత్యవసర సరుకులు నిల్వ ఉంచినా సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో కాకినాడ అర్బన్, కరప, కాకినాడ రూరల్‌ సివిల్‌ సప్‌లై అధికారులు ఎం.సూరిబాబు, పి.సుబ్బారావు, ఎ. తాతారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు