అయ్యో! వీధికుక్క ఎంత పని చేసింది..

15 Jan, 2020 15:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని ఓ పసిబిడ్డ కన్నుమూసింది. ఆపరేషన్‌ థియేటర్‌లోకి ప్రవేశించిన ఓ కుక్క అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఫరూకాబాద్‌కు చెందిన రవికుమార్‌ అనే వ్యక్తి తన భార్య కాంచనకు నొప్పులు రావటంతో ఆవాస్‌ వికాస కాలనీలోని ఆకాశ గంగ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. మొదట నార్మల్‌ డెలివరీ చేస్తామన్న వైద్యులు తర్వాత సిజేరియన్‌ చేయాలన్నారు. ఆపరేషన్‌ చేయటానికి కాంచనను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఆపరేషన్‌​ అయినపోయిన తర్వాత ఆమెను వార్డుకు తరలించారు. అయితే పసిబిడ్డను ఆపరేషన్‌ థియేటర్‌లోనే ఉంచాల్సి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆపరేషన్‌ థియేటర్‌లో కుక్క ఉందంటూ ఆసుపత్రి సిబ్బంది అరవటం మొదలుపెట్టారు. అరుపులు విన్న కుమార్‌ వెంటనే ఓటీ వైపు పరుగులు తీశాడు.

అక్కడి నేలపై పసిబిడ్డ రక్తపు మడుగులో పడిఉండటం చూసి సహాయం కోసం అరవటం మొదలుపెట్టాడు. వైద్యులు అక్కడికి చేరుకుని బిడ్డను పరీక్షించారు. కుక్క గాయపరచటంతో బిడ్డ కన్నుమూసిందని తేల్చారు. ఈ విషయంపై కుమార్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ఇందుకు పరిహారంగా డబ్బు ఇస్తామని, గొడవచేయకుండా సంఘటనను ఇంతటితో మర్చిపోవాలని చెప్పారు. యాజమాన్యం ప్రవర్తనతో మరింత ఆగ్రహానికి గురైన కుమార్‌! పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి పసిబిడ్డ చావుకు కారణమైనందుకు గానూ ఆసుపత్రి యాజమానితో పాటు సిబ్బందిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. అంతేకాకండా సరైన పత్రాలు, లైసెన్స్‌ లేని కారణంగా ఆసుపత్రిని మూసివేయాలని ఫరూకాబాద్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు.
 

మరిన్ని వార్తలు