ఇండోనేషియాలో భూకంపం

26 Mar, 2018 07:53 IST|Sakshi
భూకంపకేంద్రం

ఇండోనేషియా:  తూర్పు ఇండోనేషియాలో సోమవారం వేకువజామున భూకంపం సంభవించింది.  భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4గా నమోదైంది. దీంతో భూకంపాలను సమీక్షించే సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. బాండా సముద్ర ప్రాంతంలో భూ ఉపరితలం నుంచి 171 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. మొదటి సునామీ హెచ్చరికను హిందూ మహా సముద్రం సునామీ వార్నింగ్‌ అండ్‌ మిటిగేషన్‌ సిస్టమ్‌(ఐఓటీడబ్లుఎంఎస్‌) జారీ చేసింది.

సెకండ్‌ బులెటిన్‌లో ఈ సునామీతో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అంబన్‌ ఐలాండ్‌కు 380 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు స్పష్టం చేశారు. భూకంపం 2 నుంచి 3 సెకండ్ల పాటు ఉందని చెప్పారు. ఇదే ప్రాంతంలో గత నెల 26న 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, కానీ ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు.

ఇండోనేషియా పసిఫిక్‌ రింగ్‌పై ఉందని, అందువల్లే తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని, వీటితో పెద్దగా ప్రమాదం లేదని స్థానిక అధికారుల తెలిపారు.  2004 సంవత్సరంలో 9.3 తీవ్రతతో సునామీ సంభవించడంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.2 లక్షల మంది చనిపోయిన సంగతి తెల్సిందే. ఒక్క ఇండోనేషియాలోనే 1.68 లక్షల మంది చనిపోయారు.

మరిన్ని వార్తలు