‘స్వామి లీలలు బట్టబయలైనా అరెస్ట్‌ చేయలేదు’

9 Sep, 2019 18:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ (72)పై ఆయన నిర్వహించే లా కాలేజిలో చదివిన విద్యార్ధిని (23) ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్మయానంద్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన యువతి యూపీలోని షహజన్‌పూర్‌లోని తన ఇంటి నుంచి అదృశ్యమైన వారం రోజుల తర్వాత రాజస్ధాన్‌లో ప్రత్యక్షమైంది. చిన్మయానంద్‌పై తాను చేసిన ఫిర్యాదును యూపీ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ పోలీసులను ఆశ్రయించానని ఆమె పేర్కొన్నారు. చిన్మయానంద్‌ తనపై లైంగిక దాడి చేయడంతో పాటు ఏడాది పాటు తనను శారీరకంగా హింసించారని బాధిత యువతి మీడియా ముందు వెల్లడించారు. లోధి రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో తన ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ పోలీసులు  తన ఫిర్యాదును షహజన్‌పూర్‌ పోలీసులకు మళ్లించారని ఆమె తెలిపారు. కాగా యువతి ఫిర్యాదును విచారించాలని సుప్రీం కోర్టు సిట్‌ను ఆదేశించిన క్రమంలో ఆదివారం సిట్‌ తనను 11 గంటలు ప్రశ్నించిందని, స్వామి చిన్మయానంద్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని తాను వారికి వివరించానని, తాను వారికి అన్ని విషయాలు చెప్పినా ఇంతవరకూ నిందితుడిని అరెస్ట్‌ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా సంత్‌ సమాజ్‌లో పేరున్న నేత పలువురు యువతుల జీవితాలను నాశనం చేశాడని, తనను చంపుతానని బెదిరించాడని తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసిన అనంతరం ఎఫ్‌బీ పేజీని మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్లిన యువతి ఆగస్ట్‌ 30న రాజస్ధాన్‌లో ప్రత్యక్షమైంది. ఫేస్‌బుక్‌ పేజీలో స్వామి చిన్మయానంద్‌ పేరును ఆమె నేరుగా వెల్లడించకపోయినా ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజకీయ పలుకుబడి కలిగిన నేత అంటూ చిన్మయానంద్‌ పేరును పరోక్షంగా ప్రస్తావించారు. స్వామి చిన్మయానంద్‌పై లైంగిక దాడి ఆరోపణలు కలకలం రేపాయి. తనకు సాయం చేయాలంటూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ప్రధాని నరేంద్ర మోదీలకు విజ్ఞప్తి చేశారు. కాగా చిన్మయానంద్‌పై ఆరోపణలు అవాస్తవమని ఆయన తరపు న్యాయవాది తోసిపుచ్చారు. స్వామి పోలీసుల నుంచి తప్పించుకుని తిరగడం లేదని, ఆథ్యాత్మిక కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అవసరమైన సమయంలో స్వామి ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరవుతారని పేర్కొన్నారు. రాజకీయ ప్రాబల్యం కలిగిన స్వామి చిన్మయానంద్‌ షహజన్‌పూర్‌లో ఆశ్రమంతో పాటు పట్టణంలో ఐదు కాలేజీలను నిర్వహిస్తున్నారు. హరిద్వార్‌, రిషీకేష్‌ల్లోనూ ఆశ్రమాలు నిర్వహిస్తున్న చిన్మయానంద్‌ ఆథ్యాత్మిక, వ్యాపార సామ్రాజ్యం రూ కోట్లలో ఉంటుందని చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా