ఉలిక్కిపాటు.. స్కూళ్లలో తుపాకుల కలకలం

16 Feb, 2018 10:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌ : అమెరికాలోని పలు పాఠశాలలో తుపాకులు లభ్యం కావటం కలకలం రేపుతోంది. ఫ్లోరిడా మారణహోమం తర్వాత అప్రమత్తమైన అధికారులు పలు స్కూళ్లలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో తుపాకులను కలిగి ఉన్న పలువురు విద్యార్ధులను అరెస్ట్‌ చేయగా..  తల్లిదండ్రులు ఉలిక్కి పడ్డారు. 

గురువారం ఉత్తర టెక్సాస్‌లోనే ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫ్లవర్‌ మౌండ్‌ మర్కస్‌ హైస్కూల్‌లో తుపాకీ, మందు గుండు సామాగ్రితో ఉన్న ఓ విద్యార్థి(16)ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. తోటి విద్యార్థులు అందించిన సమాచారం మేరకు ప్లానో వెస్ట్‌ హై స్కూల్‌లో ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా వారిని అరెస్ట్‌ చేశామని అధికారులు తెలియజేశారు.  

గార్లాండ్‌లో చోటు చేసుకున్న ఘటనలో మరో విద్యార్థిని అరెస్ట్‌ చేశారు. సౌత్‌ గార్లాండ్‌ హైస్కూల్‌లో సెల్‌ ఫోన్‌ దొంగతనం అయినట్లు ఫిర్యాదు అందగా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి బ్యాగ్‌లో తుపాకీ దొరికింది. ఇక మరో రెండు చోట్ల దాడులకు పాల్పడతామని బెదిరించిన ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అర్లింగ్‌టన్‌లోని నికోలస్‌ జూనియర్‌ హైస్కూల్‌లో ఓ విద్యార్థి(13)ని, వెదర్‌ఫోర్ట్‌ హైస్కూల్‌లో ఓ బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని.. అయితే వాటిని తేలికగా తీసుకోకుండా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ  తల్లిదండ్రులను ఉద్దేశించి పోలీస్‌ శాఖ ఓ లేఖ విడుదల చేసింది. ఫ్లోరిడా రాష్ట్రంలో పార్క్‌లాండ్‌ మేజరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ హైస్కూల్‌లో 19 ఏళ్ల మాజీ విద్యార్థి విచ్చలవిడిగా కాల్పులకు దిగి 17 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన తెలిసిందే. 

మరిన్ని వార్తలు