మార్కుల పోటీలో... రాలిపోతున్న విద్యాకుసుమాలు

7 Jul, 2018 10:02 IST|Sakshi
విద్యార్థిని మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు

చదువు పేరిట తీవ్ర ఒత్తిడి

ఒత్తిడి భరించలేక బలవన్మరణం

తల్లిదండ్రుల్లో మార్పు రావాలంటున్న మానసిక వేత్తలు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కులు, ర్యాంకులే ప్రధానమనే భ్రమలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇదే అదునుగా కళాశాలల యాజమాన్యం విద్యార్థులపై చదువు పేరుతో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీంతో పిల్లలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా పోతోంది. సెలవుల్లోనూ ఆటవిడుపుకు దూరం అవుతున్నారు. తమ బాధను అర్థం చేసుకునే వారు లేక, తీవ్ర ఒత్తిడిని భరించలేక పసి హృదయాలు తల్లడిల్లుతున్నాయి. ఒకానొక దశలో పిల్లలు జీవితంపై విరక్తి చెంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.  

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంటర్‌ విద్యార్థులే ఉంటున్నారు. ఉన్నత విద్యకు వారధి ఇంటర్‌ కావడంతో వీరిపై ఒత్తిడి ఎక్కువ అవుతోంది. పదో తరగతి వరకు స్వేచ్ఛగా విద్యనభ్యసించిన విద్యార్థులు ఇంటర్‌కు వచ్చే సరికి చతికిలబడుతున్నారు. ముఖ్యంగా జైలును తలపించే కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. ఆటలు, షికారులు లేకపోవడంతో మానసిక రోగిలా మారుతున్నారు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఒత్తిడి లేని విద్యనందించేలా చర్యలు తీసుకోవాలంటూ మేధావులు, విద్యావేత్తలు సూచిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పిల్లల ఇష్టాలు తెలుసుకోవాలి
ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లల ఆసక్తి, వారి ఇష్టాలను పట్టించుకోవడం లేదు. తమ ఆశలు, ఆకాంక్షలను వారిపై రుద్ది ఇంజినీరింగ్, మెడిసిన్‌ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పిల్లలు ఆయా కోర్సులను అర్థం చేసుకోలేక, తమకు ఇష్టమైన కోర్సు చదవలేక మథన పడుతున్నారు. తల్లిదండ్రుల్లో మార్పు వచ్చినప్పుడే పిల్లల బలవన్మరణాలు తగ్గుతాయని మానసికవేత్తలు, మేథావులు చెబుతున్నారు.

తరచూ మాట్లాడాలి
తల్లిదండ్రులు తరచూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. వారు చదువులో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీయాలి. మానసికంగా ధైర్యం నింపడం ద్వారా వారిలో ఉన్న ఆందోళన దూరం అయి చురుగ్గా ఉంటారు.

విద్యార్థిని అనుమానాస్పద మృతి
గత మూడేళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరందరూ వివిధ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నవారే. తాజాగా శుక్రవారం ఉదయం తిరుపతి సమీపంలోని తనపల్లి రోడ్డులో ఉన్న శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థిని కె.శ్రుతి(17) అనుమానాస్పదంగా మృతి చెందింది. వాయల్పాడు మండలం శాకంవారిపల్లికి చెందిన సిద్ధమల్లు, కళావతి దంపతుల కుమార్తె కె.శ్రుతి ఆ కళాశాలలో ఇం టర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యతోనే మృతి చెందిం దంటూ తల్లిదండ్రులు, కళాశాల యాజమానులు చెబుతున్నారు. పోస్టుమార్టం చేస్తే నిజాలు తెలిసొచ్చేవని, పోస్టుమార్టం  చేయకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు చెబుతున్నారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ విద్యార్థి సంఘం, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, ఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యార్థిని మృతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలం టూ డిమాండ్‌ చేశారు. రెసిడెన్షియల్‌ కళాశాలను నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా కళాశాలను నిర్వహిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని విద్యాశాఖాధికారులను ప్రశ్నించారు. చదువు పేరుతో విద్యార్థులను బలితీసుకుంటున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. కళాశాలలు పునఃప్రారంభమైన కొద్ది రోజులకే ఆత్మహత్యల పర్వం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత కళాశాల యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు బనాయించాలని, గుర్తింపు రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు సుధీర్, హేమంత్‌కుమార్‌రెడ్డి, శివకృష్ణ, జయప్రకాష్, ప్రసాద్, దిలీప్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇమామ్, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు శివారెడ్డి, చలపతి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాధవకృష్ణ, గిరి, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు వసీం, ఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నగేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు