పరీక్షల్లో పాస్‌ కాలేనేమోనని ఆత్మహత్య

1 Dec, 2019 11:16 IST|Sakshi
విద్యార్థి మహేంద్ర మృతదేహం

సాక్షి, ఎమ్మిగనూరు: పట్టణంలోని బీసీ హాస్టల్‌లో శనివారం తెల్లవారు జామున ఇంటర్‌ విద్యార్థి హరిజన మహేంద్ర(19) ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు.. కోడుమూరు మండలం మెరుగుదొడ్డి గ్రామానికి చెందిన ఈరన్న, యశోదమ్మలకు మహేంద్ర, వీరేంద్ర సంతానం. పెద్ద కుమారుడు హరిజన మహేంద్ర పట్టణంలోని రాఘవేంద్ర జూనియర్‌ కాలేజీలో హెచ్‌ఈసీ ఇంటర్‌ ద్వితీయం సంవత్సరం చదువుతున్నాడు. వీరేంద్ర బురాన్‌దొడ్డిలో పదో తరగతి చదువుతున్నాడు. హరిజన మహేంద్ర కాలేజీలో చదువుతూ గుడేకల్‌ రోడ్డు శివ సర్కిల్‌లోని బీసీ వసతి గృహంలో ఉంటున్నాడు. ఫస్ట్‌ ఇయర్‌లో మూడు సబ్జెక్ట్‌లు ఫెయిల్‌ అయ్యాడు. ఈ ఏడాది పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఆందోళన చెందేవాడు.

ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున స్టడీహాల్‌లో ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం స్నేహితులు గమనించి వార్డెన్‌ అబ్దుల్‌ అజీమ్‌కు సమాచారం అందించగా అతడు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని పోలీసులకు, విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చేరవేశాడు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సీసీ ఫుటేజీలో నమోదు.. 
విద్యార్థి మహేష్‌ ఆత్మహత్య ఘటన హాస్టల్‌ని సీసీ ఫుటేజీలో నమోదై ఉంది. శుక్రవారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్యార్థి ఉరి వేసుకునేందుకు శనివారం తెల్లవారుజాము 1.55 గంటల వరకు వేచి చూశాడు. వార్డెన్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రాలయం హాస్టల్‌ నుంచి రాత్రి 11గంటలకు వచ్చారు. ఆ సమయంలో బయటే ఉన్న విద్యార్థి మహేష్‌ను వార్డెన్‌ పలకరించారు. తోటి విద్యార్థి ఒకరు 1.30 గంటల వరకు చదువుకుంటుండటంతో అంతవరకు వేచి చూశాడు. ఆ విద్యార్థి నిద్రకు ఉపక్రమించగానే తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

మరిన్ని వార్తలు