విద్యార్థుల మధ్య ఘర్షణ.. నాలుగో తరగతి విద్యార్థి మృతి

23 Oct, 2018 22:09 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ఇద్దరు విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన ఖమ్మం ప్రభుత్వ గిరిజన పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గిరిజన పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి, అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న జోసెఫ్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన పదో తరగతి విద్యార్ధి మంగళవారం మధ్యాహ్నం  జోసెఫ్‌ను కొట్టడంతో.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని మిగిలిన విద్యార్థులు హెడ్‌ మాస్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. 

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అలాగే ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకుని పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్ధుల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ జరుగుతుంటే అధ్యాపకులు, సిబ్బంది ఎం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు