కన్నవారికి గుండె కోత

30 Dec, 2019 10:34 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి కరీముల్లా ప్రమాదానికి కారణమైన లారీ కింద పడిన బైక్‌

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం  

విషాదంగా మారిన సెలవు రోజు

ప్రకాశం, మార్కాపురం: సరదాగా గడపాల్సిన ఆదివారం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం విద్యార్థి జీవితాన్ని కబళించింది. పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో పెద్ద వాటర్‌ ట్యాంక్‌ దగ్గర మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీ కొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని శివాజీనగర్‌ 6వ లైనులో నివాసం ఉండే దూదేకుల చిన్న జీజీర్‌ కుమారుడు కరీముల్లా (15) స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎన్‌సీసీ డ్రిల్‌కు వెళ్లి బయటకు వచ్చిన తరువాత స్నేహితుడి మోటార్‌ బైక్‌ తీసుకుని తర్లుపాడు రోడ్డు వైపు వెళ్తుండగా వినుకొండ నుంచి రాగుల లోడుతో వస్తున్న లారీ పెద్ద వాటర్‌ ట్యాంక్‌ వద్దకు రాగానే లారీడ్రైవర్‌ తన వాహనాన్ని లెఫ్ట్‌ వైపు కట్‌ చేస్తుండగా అప్పుడే మోటార్‌ సైకిల్‌పై వస్తున్న కరీముల్లాకు తగలటంతో లారీ కింద పడి దుర్మరణం చెందాడు.

వార్త విన్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. మార్బుల్‌ రాళ్ల కూలీగా పని చేస్తున్న చిన్న జజీర్‌కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. మృతుడు కరీముల్లా ఆఖరి అబ్బాయి. బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తాడని కలలు కంటుండగా ఊహించని రీతిలో లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చి కుటుంబంలో విషాదం నింపిందని కుటుంబ సభ్యులు రోదించారు. శివాజీనగర్‌ 6వ లైనులో ఉంటున్న కరీముల్లా ఆ ప్రాంతంలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతని మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఉదయం 6 గంటల వరకు తమతో ఉన్న కుమారుడు 9గంటల కల్లా మృతదేహంగా రోడ్డుపై పడి ఉండటాన్ని తల్లిదండ్రులు నమ్మలేకపోయారు.

మరిన్ని వార్తలు