ఎమ్మెల్యే పేరిట మహిళలకు మెసేజ్‌లు.. అరెస్ట్

12 Oct, 2017 13:40 IST|Sakshi

సాక్షి, ముంబై : సోషల్ మీడియాలో ఫేక్‌ అకౌంట్లను క్రియేట్‌ చేయటం.. సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేయటం... తరచూ చూస్తున్నదే. అయితే ఇక్కడ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మాత్రం మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించాడు. ఆయన పేరు మీద సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్‌ చేసి మహిళలకు సందేశాలు పంపటం ప్రారంభించాడు. అతగాడి విషయం తెలీక ఎమ్మెల్యేనే ఆ పని చేస్తున్నాడంటూ విమర్శలు వినిపించాయి కూడా. 

సీనియర్ నేత, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర అవాహద్‌ ఈ కేసులో బాధితుడు కావటం విశేషం. మహిళలతో గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటమే కాదు.. వారిని డిన్నర్‌ లకు రావాల్సిందిగా ఆహ్వానించేవాడంట. మరి కొందరు ఏకంగా అవాహద్‌ ఆఫీస్‌కే వచ్చేయటంతో ఆయనకు అసలు విషయం అర్థం అయ్యింది. దీంతో వెంటనే ఆయన సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే అప్రమత్తమైన ఆ నిందితుడు.. ఆ ఆకౌంట్లను బ్లాక్ చేసేశాడు. కానీ, అది కొద్ది కాలం మాత్రమే. తిరిగి మళ్లీ ఈ మధ్యే మళ్లీ కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి మళ్లీ మహిళలకు మెసేజ్‌లు పంపటం ప్రారంభించాడు. 

ఈసారి మాత్రం థానే పోలీసులే ముందున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా అతగాడిని పట్టేసుకున్నారు. తాను సందేశాలు పంపుతుంటే వారిచ్చే సమాధానాలను ఆస్వాదించేవాడినని ఆ యువకుడు చెప్పటం విశేషం. ఆ యువకుడి పెరేంట్స్ విదేశాల్లో ఉండగా.. బంధువుల వద్ద ఉంటూ ముంబైలోని ఓ టాప్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ విద్యనభ్యసిస్తున్నాడంట.

మరిన్ని వార్తలు