తోటి విద్యార్థులు వేధించారంటూ ఆత్మహత్య

18 Oct, 2017 03:24 IST|Sakshi

బాలిక సూసైడ్‌ నోట్‌ లభ్యం

హన్వాడ: ‘నా చావుకు కారణం తరగతి గదిలోని విద్యార్థులు కాబట్టి నా కోసం వెతకవద్దు...’ అంటూ ఓ విద్యార్థిని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి వెలుగుచూసింది. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం పెద్దర్పల్లికి చెందిన అడవిగొల్ల మల్లేశ్, లక్ష్మమ్మ ఏకైక కూతురు ప్రియాంక(14) హన్వాడ  శ్రీవిద్యా విజ్ఞాన్‌ మందిర్‌లో 8వ తరగతి చదువుతోంది. ఆమె చదువులో చురుకుగా ఉండటంతో తోటి విద్యార్థులు నిత్యం సూటిపోటి మాటలతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మనోవేదనకు గురై ఆత్మహత్యకు పురికొల్పేలా చేశాయి.

ప్రియాంక సోమవారం పాఠశాలకు వచ్చాక తనకు వాంతులు అవుతున్నాయని చెప్పి బయటకు వెళ్లింది. ఆమె తలిదండ్రులు సోమవారం రాత్రి, మంగళవారం వరకు ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియరాలేదు. ఇక మంగళవారం రాత్రి 8 గంటలకు పెద్దర్పల్లి శివారు మోత్కుకుంటలో గ్రామస్తులకు మృతదేహం కనిపించగా ఆరా తీయడంతో ప్రియాంకదిగా తేలింది. ఈ మేరకు పాఠశాలలో పరిశీలించగా ఆమె బ్యాగు లభించింది. అందులో సూసైడ్‌ నోట్‌ కూడా ఉండటంతో ఆత్మహత్యగా తేల్చారు.

మరిన్ని వార్తలు