నింద మోయలేక..

13 Sep, 2018 11:17 IST|Sakshi
విద్యార్థిని మృతదేహం

తిరువొత్తియూరు: దొంగతనం చేశావని ఉపాధ్యాయురాలు నింద మోపడంతో అవమానభారం తట్టుకోలేక విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. సేలం జిల్లా కొంగనాపురం సమీపం పుదుపాళయం పంచాయతీ అరసి పాళయంలో మాధ్యమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాల్లో విద్యార్థిని వసంతి ఏడో తరగతి చదువుతోంది. ఈమె తండ్రి తంగవేలు, తల్లి సరస్వతి. చాంతాడు తయారీ వృత్తి చేస్తున్నారు. ఇదిలాఉండగా పాఠశాల్లో ఉపాధ్యాయురాలు లీలా పర్సు నుంచి రూ.600 నగదు చోరీకి గురైంది. దీనిపై  ఉపాధ్యాయులు విద్యార్థుల వద్ద విచారణ చేశారు. అనంతరం ఏడో తరగతి విద్యార్థిని వసంతి రూ.600 నగదు చోరీ చేసినట్టు అనుమానించారు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన వసంతిని సదరు ఉపాధ్యాయురాలు తీవ్రంగా మందలించినట్టు తెలిసింది.

దీంతో అవమానభారం తట్టుకోలేక విద్యార్థిని వసంతి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పాఠశాల నుంచి పరుగులు తీసింది. అక్కడున్న ఉపాధ్యాయులు, విద్యార్థినిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వేగంగా వెళ్లిన విద్యార్థిని పాఠశాలకు ఎదురుగా ఉన్న వ్యవసాయ బావిలో దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న కొంగణాపురం పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మణివన్నన్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి శవపరీక్ష కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఇదిలాఉండగా విద్యార్థిని మృతికి కారణమైన ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థిని బంధువులు పాఠశాలను ముట్టడించారు. పోలీసులు వారిని సమాధానపరిచి కేసు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు