మిత్రులు మోసం చేశారని విద్యార్థి ఆత్మహత్య

11 Mar, 2018 08:51 IST|Sakshi
సాయిచరణ్‌ (ఫైల్‌) , పోలీసుల అదుపులో నాగరాజు, రాజేష్‌

సూసైడ్‌నోట్‌లో ఇద్దరు మిత్రుల పేర్లు ..

అరెస్ట్‌ చేసిన పోలీసులు

చిలకలగూడ: కష్ట సమయ ంలో ఉన్న మిత్రులను ఆదుకునేందుకు తన వద్ద ఉన్న బంగారు చైన్‌ ఇస్తే తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం చిలకలగూడ ఠాణా పరిధిలో ఈ సంఘటన జరిగింది.  తన చావుకు ఇద్దరు మిత్రులే కారణమని సూసైడ్‌నోట్‌ రాయడంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. చిలకలగూడ సీఐ రుద్రభాస్కర్, ఎస్‌ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి తెలిపిన మేరకు..  బౌద్ధనగర్‌ వారాసిగూడకు చెందిన ఎం.సాయిచరణ్‌ (21) నగరంలోని అవంతి డిగ్రీ కాలేజీలో బీకాం ఫైనలియర్‌ చదువుతున్నాడు. ఓయు సిటీ అంగడిబజారుకు చెందిన గూడపు నాగరాజు (26), మాణికేశ్వరినగర్‌కు చెందిన జీ. రాజేష్‌(27)తో పరిచయం కలగడంతో మిత్రులుగా మారారు.

నాగరాజు, రాజేష్‌ గత దీపావళికి క్రాకర్స్‌ బిజినెస్‌ చేసి నష్ట పోయి అప్పుల పాలయ్యారు. స్నేహితులు కోరిక మేరకు సాయిచరణ్‌ తన వద్ద ఉన్న 20 గ్రాముల బంగారు గొలుసును వారికి ఇచ్చాడు. నెలలు గడుస్తున్నా బంగారు గొలుసు తిరిగి ఇవ్వకపోవడంతో మిత్రుల మధ్య తరుచు వాగ్వాదం జరిగేది.  ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మిత్రుల మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సాయిచరణ్‌ ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఫ్యాను హుక్‌కు తాడులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.సోదరుడు భానుసాయిప్రసాద్‌  రాత్రి 2 గంటల సమయంలో గమనించగా వేలాడుతూ కనిపించాడు.  కుటుంబసభ్యులు కిందికి దించి గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మిత్రులు నాగరాజు, రాజేష్‌ల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్‌నోట్‌లో స్పష్టం చేశాడు. దీంతో ఆత్మహత్యకు కారణమైన నాగరాజు, రాజేష్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని, గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని సీఐ రుద్రభాస్కర్, ఎస్‌ఐ వరుణ్‌కాంత్‌రెడ్డిలు తెలిపారు.

మరిన్ని వార్తలు