హాల్‌ టికెట్లు ఇవ్వలేదని

19 Apr, 2018 15:24 IST|Sakshi
కళాశాలలో భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నించిన విద్యార్థులు

ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం

ఫార్మసీ కళాశాల భవనం పైనుంచి దూకే ప్రయత్నం

విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మొయినాబాద్‌(చేవెళ్ల): పరీక్షలు రాసేందుకు హాల్‌ టికెట్లు ఇవ్వడంలేదంటూ ఇద్దరు విద్యార్థులు కళాశాల భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన మొయినాబాద్‌ మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న గ్లోబల్‌ ఫార్మసీ కళాశాలలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్లోబల్‌ ఫార్మసీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 23 మంది విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు కళాశాల యాజమాన్యం హాల్‌ టికెట్లు ఇవ్వలేదు. సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభం కావడంతో అంతకు ముందే పలుమార్లు విద్యార్థులు హాల్‌ టికెట్ల కోసం ప్రిన్సిపల్‌ను అడిగారు. చివరి నిమిషం వరకు హాల్‌ టికెట్లు వస్తాయని చెప్పిన ప్రిన్సిపల్‌ పరీక్షలు ప్రారంభమైన రోజున హాజరు సరిగా లేనందున మీరంతా డిటెండ్‌ అయ్యారని చెప్పారు.

దీంతో మంగళవారం నాడు విద్యార్థులు కళాశాలలోనే ఆందోళన నిర్వహించి విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఎన్‌ఎస్‌టీడబ్ల్యూఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు కళాశాలకు వచ్చి యాజమాన్యంతో మాట్లాడారు. జేఎన్‌టీయూ నుంచే 23 మంది విద్యార్థులను డిటెండ్‌ చేశారంటూ చెప్పడంతో అందులోని ఇద్దరు విద్యార్థులు మహ్మద్‌ ఆసిఫ్, అయూబ్‌లో కళాశాల భవనం పైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. అప్పటికే కళాశాల వద్దకు చేరుకున్న పోలీసులు వారిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు