ఇద్దరు విద్యార్థుల మృత్యువాత

31 Oct, 2018 13:49 IST|Sakshi
మృతులు నవీన్‌ (ఫైల్, రవిశంకర్‌ (ఫైల్‌)

కాలువలో పడి ఒకరు, బావిలో పడి మరొకరు మృతి

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు

ఆటపాటలతో మిత్రుల మధ్య ఆనందం పంచుకుంటున్న ఇద్దరు విద్యార్థులను మంగళవారం విధి కాటేసింది. కాలువ రూపంలో ఒకరిని, బావి రూపంలో మరొకరి మృత్యువు మింగేసింది. అప్పటి వరకు సరదా కబుర్ల మధ్య నవ్వులు చిందించిన ఆ యువకులను అనంతలోకాల్లో కలిపేసింది. నకరికల్లు మండలం చేజర్లలో ఒక్కగానొక్క 18 ఏళ్ల కుమారుడు కాలువలో పడి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు వేదన హృదయవిదారకంగా మారింది. రాజుపాలెం మండలం అనుపాలెంలో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన 15 ఏళ్ల విద్యార్థిని బావి మింగేయడంతో అమ్మమ్మ, తాతయ్యల గుండె తల్లడిల్లింది.   

గుంటూరు, చేజర్ల(నకరికల్లు): కాలువలో జారి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని చేజర్లలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేజర్ల గ్రామానికి చెందిన గాడిదమళ్ల రాజేశ్వరి, నాగేశ్వరరావు దంపతులకు రవిశంకర్‌(19)తోపాటు ఒక కుమార్తె ఉన్నారు. నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం గ్రామంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు మిత్రులతో కలసి అద్దంకి బ్రాంచి కెనాల్‌ కాలువ గట్టుకు వెళ్లాడు. అక్కడ కాలు జారడంతో కాలువలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో కాలువలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అతి కష్టం మీద మృత దేహాన్ని బయటికి తీశారు. ఒక్కగానొక్క కుమారుడు అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదించారు. ‘అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా నాయనా’ అంటూ ఆ తల్లి తల్లడిల్లింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జీ అనీల్‌కుమార్‌ తెలిపారు.  చేజర్ల గ్రామ సమీపంలోని అద్దంకి బ్రాంచి కాలువలో ఈ నెలలోనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  కాలువపై రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.    

బావిలో పడి..
అనుపాలెం(రాజుపాలెం): కాలు జారి బావిలో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని అనుపాలెంలో మంగళవారం రాత్రి  చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పురంశెట్టి నవీన్‌(15) అనుపాలెం జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బావి  దిమ్మె మీద కూర్చొని ఉండడంతో పొరపాటున జారి  బావిలో ఉన్న బురదలో కూరుకుని ఊపిరాడక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రమేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నవీన్‌ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు