రాకాసి గుంత... ఇద్దరిని మింగేసింది..

15 Jul, 2018 09:52 IST|Sakshi
మృతదేహాలను బయటకు తీస్తున్న స్థానికులు, రోదిస్తున్న భార్గవ్‌ తల్లి సావిత్రి

బూర్గంపాడు: సీతారామ ప్రాజెక్ట్‌ కాలువ పనుల కోసం తవ్విన గుంత ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకుంది. ఇటీవలి వర్షాలకు ఈ నీటి గుంతలో నీరు చేరింది. శనివారం పాఠశాలలకు సెలవు కావటంతో గేదెలను సరదాగా మేపేందుకు ఆ కాలువ వైపు వెళ్లిన ఇద్దరు పిల్లలను ఆ నీటి గుంత అమాంతం మింగేసింది. మండలంలోని జింకలగూడెం గ్రామ సమీపంలోగల సీతారామ ప్రాజెక్ట్‌ కాలువల వద్ద ఇది జరిగింది.

మండలంలోని మోరంపల్లిబంజర గ్రామాని కి చెందిన గంటా భార్గవ్‌(10), అతని సమీప బంధువైన దుబ్బాల సుధీర్‌(18) కలిసి జింకలగూడెం గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్‌ కాలువ వద్దనున్న తమ పొలానికి గేదెలతోపాటు  శనివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం వేళ అటుగా వెళ్తున్న స్థానికులు.. ఆ గుంత పక్కన రెండు జతలు చెప్పులు, పశువుల అదిలించేందు కు ఉపయోగించే కర్రలు ఉండటాన్ని గమనించా రు. గుంతలోకి నిశితంగా పరిశీలించారు. అందు లో ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా గమనించారు. వారిచ్చిన సమాచారంతో గ్రామస్తులు, పోలీసులు వచ్చారు. గుంత నుంచి ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. వారిని మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన గంటా రమేష్‌–సావిత్రి దంపతుల కుమారుడు భార్గవ్‌(10), వారి సమీప బంధువు దుబ్బాల సుధీర్‌(18)గా గుర్తించారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో భార్గవ్‌ ఐదవ తరగతి చదువుతున్నాడు.
 
రమేష్‌ సోదరి కుమారుడైన దుబ్బాల సుధీర్‌ ది క్రిష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని రమనాగుపేట గ్రామం. దుబ్బాల మంగళాద్రి–ఉమ దంపతులు రెండవ కుమారుడైన సుధీర్,  చిన్నత నం నుంచి మోరంపల్లిబంజరలోని అమ్మమ్మ ఇం ట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. ప్రస్తుతం పాల్వంచలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. శనివారం భార్గవ్, సుధీర్‌ కలిసి పొలానికి వెళ్లి గుంతలో ప్రాణాలు కోల్పోయారు.
 
ఎలా జరుగిందో... 
‘ఆ నీటిగుంతలో ముందుగా భార్గవ్‌ జారిపడి ఉంటాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో సుధీర్‌ కూడా గుంతలో పడిపోయుంటాడు. సుధీర్‌ ప్యాంట్‌ జేబులో సెల్‌ఫోన్‌ ఉంది. దీనిని బట్టి, భార్గవ్‌ను రక్షించేందుకు వెంటనే గుంతలోకి వెళ్లి ఉంటాడని అర్థమవుతోంది’ అని, స్థానికులు భావి స్తున్నారు. భార్గవ్, సుధీర్‌ కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. పిల్లల మృతితో మోరంపల్లి బంజరలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదస్థలాన్ని పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు, స్థానిక ఎస్‌ఐ సంతోష్‌ పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మున్నేరులో వ్యక్తి గల్లంతు  
ఖమ్మంరూరల్‌: మండలంలోని తీర్థాల వద్ద మున్నేటిలో శనివారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. రామన్నపేటకు చెందిన ఆరెంపుల నాగయ్య(47), తాపీ కార్మికుడు. తోటి కార్మికులతోపాటు శుక్రవారం మంగళగూడెంలో పనికి వెళ్లాడు. అక్కడే బాగా పొద్దుపోయింది. వర్షం కూడా పడుతోంది. దీంతో ఆ రాత్రి మంగళగూడెంలోనే ఉన్నాడు. శనివారం ఉదయం రామన్నపేటకు బయలుదేరాడు. తీర్ధాల వద్ద మున్నేటిపై నిర్మిస్తున్న రోడ్‌ కం బ్రిడ్జి  వద్దకు చేరుకున్నాడు. మున్నేటిలో దిగి కామంచికల్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో మున్నేటికి ఒక్కసారిగా వరద ఉధృతి రావడంతో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. నాగయ్య కోసం గాలింపు సాగుతోంది. ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

మరిన్ని వార్తలు