ఫొటో సరదాకు ముగ్గురి బలి

24 Dec, 2018 09:49 IST|Sakshi

క్వారీ గుంతలో పడి విద్యార్థుల దుర్మరణం

వీరిలో ఇద్దరు అన్నదమ్ములు

గుండెలుబాదుకున్న కుటుంబీకులు  

కొత్వాల్‌గూడ క్వారీ గుంతలో ఘటన

మృతులు నగరంలోని మోతీనగర్‌వాసులు

శంషాబాద్‌: ఫొటో సరదా ముగ్గురు విద్యార్థులను బలిగొంది. క్వారీ గుంతల వద్ద ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు అందులోపడి దుర్మరణం పాలయ్యారు. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిన విషాదకర సంఘటన ఆదివారం ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్వాల్‌గూడ క్వారీ గుంతల వద్ద చోటు చేసుకుంది. సీఐ గంగాధర్, బాధితుల కుటుంబీకుల కథనం ప్రకారం.. నగరంలోని బోరబండ మోతీనగర్‌కు చెందిన విఘ్నేశ్వర్‌రావు కుమారులు సూర్య(22), చంద్ర(19)తో పాటు అదే ప్రాంతానికి చెందిన నరేందర్‌ కుమారుడు భార్గవ్‌సాయి(19) మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఫొటోలు దిగడానికి ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్‌ మండల పరిధిలోని కొత్వాల్‌గూడ క్వారీ గుంతల వద్దకు వచ్చారు.

మిగతా స్నేహితులు ఫొటోలు తీసుకుంటుండగా సూర్య నీళ్లలోకి దిగాడు. క్వారీ గుంతల్లో సూర్య ప్రమాదవశాత్తు మునిగిపోతుండగా అతడి సోదరుడు చంద్ర పైకి లాగేందుకు ప్రయత్నించి అతడూ అందులో పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న భార్గవ్‌సాయి కూడా వారిని పైకి లాగే ప్రయత్నంలో గుంతలో పడి మునిగిపోయాడు. ముగ్గురు స్నేహితులు నీళ్లలో మునిగిపోవడంతో పక్కనే గట్టుపైన ఉన్న మరో ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి సమీపంలో ఉన్న క్రషర్‌ల వద్ద పనిచేస్తున్న కార్మికుల వద్దకు పరుగు పెట్టారు. జరిగిన విషయం వారికి చెప్పారు. కార్మికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలించినా యువకుల జాడ దొరకకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆర్‌జీఐఏ సీఐ గంగాధర్‌ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ముగ్గురి యువకుల మృతదేహాలను వెలికితీశారు. 

బోరున విలపించిన తల్లిదండ్రులు
విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విఘేశ్వర్‌రావు ఇద్దరు కుమారు సూర్య ఆర్కిటెక్చర్‌ చదువుతుండగా చంద్ర ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఉన్న ఇద్దరు కుమారులు దుర్మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. భార్గవ్‌సాయి మృతిచెందడంతో అతడి తల్లిదండ్రులు గుండలవిసేలా రోదించారు. ముగ్గురి యువకులు మృతి వార్త తెలుసుకున్న బోరబండ బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు