కాల్చితే చనిపోలేదని కత్తితో హత్యచేశారు

26 Jan, 2020 08:55 IST|Sakshi

సాక్షి, చెన్నై : చెక్‌ పోస్టులో విధుల్లో ఉన్న ఎస్‌ఐ విల్సన్‌ను తుపాకీతో తీవ్రవాది తౌఫిక్‌ కాల్చగా, మరో తీవ్రవాది అబ్దుల్‌ సమీమ్‌ కత్తితో పొడిచి హతమార్చినట్టు విచారణలో తేలింది. డీఎస్పీ గణేషన్‌ నేతృత్వంలోని బృందం శనివారం ఆ ఇద్దర్ని సంఘటన స్థలానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. కన్యాకుమారి జిల్లా కళియకావిలై చెక్‌పోస్టులో ఎస్‌ఐ విల్సన్‌ హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. పట్టుబడ్డ తీవ్రవాదుల్ని కస్టడీలోకి తీసుకున్న డీఎస్పీ గణేషన్‌ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. శనివారం ఆ ఇద్దర్నీ కళియకావిలై చెక్‌పోస్టుకు తీసుకొచ్చారు. హత్య పథకం అమలు గురించి ఆ ఇద్దర్ని అడిగి తెలుసుకున్నారు.

ఎస్‌ఐ విల్సన్‌ను తుపాకీతో తౌఫిక్‌ కాల్చగా, సమీమ్‌ ఆక్రోశంతో తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హతమార్చినట్టు విచారణలో తేలింది. ఎస్‌ఐ కూప్పకూలినానంతరం ఆ ఇద్దరు సమీపంలోని మసీదు వెనుక భాగంలో ఉన్న ప్రహరీ దూకి లోనికి వచ్చారు. ఏమి ఎరగనట్టుగా ముందు వైపు నుంచి కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి తప్పించుకు వెళ్లే పనిలో పడ్డారు. మార్గమధ్యలో లిఫ్ట్‌ తీసుకునే యత్నం చేసినా, ఏ ఒక్క వాహనదారుడు వారికి సహకరించలేదు. చివరకు ఓ ఆటోలో కొంత దూరం వెళ్లి , అక్కడినుంచి బస్సు మార్గంలో తిరువనంతపురం చేరుకున్నట్టుగా ఆ నిందితులు విచారణలో పోలీసుల దృష్టికి తెచ్చారు.

చెక్‌పోస్టులో సాగిన విచారణ అనంతరం ఆ ఇద్దర్నీ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వీరి వద్ద విచారణ సాగుతోంది. ఈ విచారణ గురించి డీఎస్పీ గణేషన్‌ మీడియాతో మాట్లాడుతూ విచారణ వేగం పెంచామన్నారు. తుపాకీ, కత్తి స్వాధీనం చేసుకున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉండగా, ఈ హత్యకు సహకరించి అరెస్టయిన వారిలోని మరో ఇద్దరు సానుభూతిపరుల ఇళ్లపై ఎన్‌ఐఏ దృష్టి పెట్టింది. కడలూరు జిల్లా నైవేలిలోని ఖాజామొహిద్దీన్‌ కొండూరులోని అలీ ఇళ్లల్లో ఈ సోదాలు సాగాయి.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా