ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

13 Oct, 2019 02:43 IST|Sakshi

ఖమ్మంలో ఘటన

భగ్గుమన్న కార్మిక సంఘాలు

సాక్షిప్రతినిధి, ఖమ్మం:ఆర్టీసీ కార్మికుల సమ్మె ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త, విషాదం, విధ్వంసకర పరిస్థితులకు దారితీసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరికి మనస్తాపంతో నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామా నికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ఖమ్మం డిపోకు చెందిన మరో డ్రైవర్‌ వెంకటేశ్వరాచారి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే వెంటనే పోలీసులు, కార్మిక సంఘాల నేతలు, రాజకీయ పక్షాలు ఆయనను నిలువరించారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నంతో పెద్ద ఎత్తున కార్మిక, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు కలెక్టరేట్‌ వద్ద మోహరించి ఆందోళన నిర్వహించారు. సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, న్యూడెమోక్రసీ కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు పలువురు కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి.. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

మణుగూరు డిపోకు చెందిన బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో బస్సు స్వల్పంగా ధ్వంసమైంది. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం పై భగ్గుమన్న కార్మిక సంఘాలు కలెక్టరేట్‌ వద్ద, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులపై బస్టాండ్‌ వద్ద పోలీస్‌ అధికారి చేయి చేసుకోవ డంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కార్మిక నాయకులు, రాజకీయ పక్షాలు ఆందోళనకు దిగాయి. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆదివారం జిల్లాలోని బస్సుల బంద్‌ నిర్వహించాలని కార్మికుల జేఏసీ నిర్ణయించింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా