రైలుపట్టాలు రక్తసిక్తం

25 Sep, 2019 12:50 IST|Sakshi

నెల్లూరులో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతి  

రైలుపట్టాలు రక్తసిక్తమయ్యాయి. నెల్లూరు నగర పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతిచెందారు. మిగిలిన ఇద్దరు ఎలా చనిపోయారో తెలుసుకునేందుకు రైల్వే పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు.వివరాలిలా ఉన్నాయి.

నెల్లూరు(క్రైమ్‌): వేదాయపాళెం రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. నలుపురంగు హాఫ్‌ హ్యాండ్స్‌ టీషర్ట్, నేవీ బ్లూ రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. మృతుడి మొహం గుర్తుపట్టలేని విధంగా మారింది. తల, మొండెం వేరయ్యాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎస్‌డీ సిరాజుద్దీన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సౌత్‌స్టేషన్‌ వద్ద..
ప్రమాదవశాత్తు లేదా రైల్లో నుంచి జారిపడో కారణం తెలియదు గానీ గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున సౌత్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. బ్లూ, తెలుపు గళ్లు కలిగిన ఫుల్‌హ్యాండ్స్‌ చొక్కా, నలుపురంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై డీసీ వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రధాన స్టేషన్‌లో..
నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో మూడో నంబర్‌ ప్లాట్‌ఫారం వద్ద మంగళవారం రైలుపట్టాలు దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపురంగు హాఫ్‌ హ్యాండ్స్‌ టీషర్ట్, గ్రే కలర్‌ లోయర్‌ ధరించి ఉన్నాడు. ప్రమాద స్థలాన్ని రైల్వే ఎస్సై డీసీ వెంకయ్య పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అండర్‌బ్రిడ్జి వద్ద..
ఆత్మహత్యో, రైల్లో నుంచి జారిపడో కారణం తెలియదు గానీ మాగుంటలేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. నలుపు, ఖాకీ రంగు గళ్ల ఫుల్‌హ్యాండ్‌స చొక్కా, నలుపురంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై ఎస్‌డీ సిరాజుద్దీన్‌ మంగళవారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా