మరిది వేధింపులు తాళలేక..

3 Nov, 2019 09:04 IST|Sakshi
రోదిస్తున్న మృతురాలి కుటుంబసభ్యులు

ఏటూరునాగారం: మండలంలోని శంకర్‌రాజుపల్లికి చెందిన వివాహిత శ్రీదేవి మృతిపై ఆమె కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతురాలి సోదరుడు మండలంలోని రొయ్యూర్‌ గ్రామానికి చెందిన కావిరి అర్జున్‌ శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. శంకరాజుపల్లి గ్రామానికి చెందిన తాటిపల్లి వెంకటయ్యకు నా చెల్లె శ్రీదేవిని ఇచ్చి 13 ఏళ్ల క్రితం వివాహం జరిపించాం. నాలుగేళ్ల క్రితం బావ వెంకటయ్య గుండెపోటుతో మరణించాడు. అప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. ‘మా బావ చనిపోయిన సంవత్సరం తర్వాత నుంచి మా బావ సోదరుడు తాటిపెల్లి రామయ్య అనునిత్యం మా చెల్లలను తిడుతూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఇలా తరచూ చేస్తుండడంతో పెద్ద మనుషుల వద్దకు పిలిపించాం. అయినా రామయ్య పద్ధతి మార్చుకోకుండా ఈనెల 1న మా చెల్లెలు పొలం పనులకు పోయి సాయంత్రం ఇంటికి వస్తుండగా రామయ్య దారిలో ఎదురుపడి మా చెల్లెలను బలవంతంగా వాళ్ల ఇంటికి తీసుకొనిపోయాడు.

నా కోరిక తీర్చాలంటూ బలవంతం చేయగా మా చెల్లెలు ప్రతిఘటించింది. దీంతో రామయ్య.. అతని భార్య తాటిపల్లి పోషమ్మ కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో మనోవేదనకు గురైన శ్రీదేవి వాళ్ల ఇంటి వద్దే ఈనెల 1న రాత్రి 7 గంటలకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంద’న్నారు. గమనించిన స్థానికులు ఆమెను ఏటూరునాగారం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వరంగల్‌కు తరలిస్తుండగా మృతి చెందిందని మృతురాలి సోదరుడు కావిరి అర్జున్‌ తెలిపారు. మా చెల్లెలి చావుకు కారణమైన రామయ్యను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ విషయమై ఎస్సై శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా తాటిపెల్లి శ్రీదేవి సోదరుడు కావిరి అర్జున్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీదేవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, తమ విచారణ అనంతరం నిందితులపై చర్య తీసుకుంటామన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు