వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసు?

21 Nov, 2017 09:01 IST|Sakshi

పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న నిందితురాలు సుజాత

ముందుకుసాగని సీబీఐ మాజీ జేడీ ఇంట్లో చోరీ కేసు

బంజారాహిల్స్‌: వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసంటూ చోరీ కేసులో నిందితురాలు పోలీసులకు సమాధానం చెబుతుంటే అర్థంకాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ నివాసంలో బంగారు ఆభరణాలు చోరీ అయిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్‌ పోలీసులు పనిమనిషి సుజాతను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు ఆమె స్వగ్రామానికి వెళ్లి చోరీ చేసిన ఆభరణాల గురించి వాకబు చేయగా ఆమె పోలీసులకు సహకరించకుండా గంటకోమాట మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజులుగా ఆమెను విచారిస్తుండగా చోరీ చేసిన ఆభరణాలు ఎక్కడ దాచిన విషయం సరిగ్గా చెప్పడం లేదు.

రోజుకొక మాట మాట్లాడుతూ పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నట్లు సమాచారం. లక్ష్మినారాయణ నివాసంలో కేవలం నెల రోజులు మాత్రమే పనిచే నగలబాక్స్‌ను మాయం చేసినట్లు  పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దోచిన నగలను కొంత మందికి విక్రయించినట్లు తెలియగా వారి వద్దకు వెళ్తే తాము కొనుగోలు చేయలేదంటూ ఎదురు తిరుగుతున్నారు. ఒక వైపు నిందితురాలు సహకరించకపోగా మరోవైపు నగలు కొనుగోలు చేసిన వారుకూడా తలోమాట మాట్లాడుతుండటంతో ఈ కేసు ముందుకు సాగడం లేదు. దొంగను పట్టుకున్నామన్న ఆనందం పోలీసులకు లేకుండా పోయింది.

>
మరిన్ని వార్తలు