వసివాడిన పసివాడు

30 Oct, 2019 00:51 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

ఫలించని 84 గంటల ప్రయత్నాలు

మృతదేహంగా వెలికితీత

సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్న నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. బిడ్డ తిరిగొస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. తమిళనాడులో ఐదురోజుల క్రితం బోరుబావిలో పడిపోయిన సుజిత్‌ (2)ను అధికారులు రక్షించలేకపోయారు. బాలుడి మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో మంగళవారం వెలికితీశారు. తిరుచ్చిరాపల్లి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన ఆరోగ్యరాజ్‌ (40), కళామేరి (35) దంపతుల సుజిత్‌ విల్సన్‌ ఈనెల 25న ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. రక్షించేందుకు చేసే ప్రయత్నాల్లో 88 అడుగుల లోతులోకి జారిపోయాడు. బోరు బావికి సమాంతరంగా తవ్వుతున్న సమయంలో సొరంగ మార్గం నుంచి దుర్వాసన రావడాన్ని అధికారులు గుర్తించారు.

సుజిత్‌ మరణించినట్లు రెవెన్యూ కార్యదర్శి రాధాకృష్ణన్‌ ప్రకటించారు. అనంతరం బోరుబావిని కాంక్రీటుతో మూసివేశారు. ఈ వార్తతో తమిళనాడు ప్రజలు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పలువురు మంత్రులు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌లు తిరుచ్చికి చేరుకుని సుజిత్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. సుజిత్‌ కుటుంబానికి సీఎం ఎడపాడి, స్టాలిన్‌ వేర్వేరుగా రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు.  అనంతరం బాలుడి అంత్యక్రియలు పూర్తిచేశారు.

మరిన్ని వార్తలు