మా నాన్న హత్యపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

23 Mar, 2019 04:55 IST|Sakshi
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సునీతమ్మ

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సునీతమ్మ

ఇక నిష్పక్షపాత విచారణ ఎలా జరుగుతుంది?

ఎన్నికల అంశంగా మార్చి ఇష్టారీతిన మాపై ఆరోపణలు చేస్తున్నారు

ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే మా వాళ్లనే ఇరికిస్తారేమోనని భయం కలుగుతోంది

వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత ఆవేదన

ఒత్తిళ్లకు గురికాని ప్రత్యేక సంస్థతో దర్యాప్తు చేయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి

ఈసీ సూచన మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శితోనూ భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యకు వైఎస్‌ జగన్‌ కుటుంబమే బాధ్యత వహించాలంటూ.. దీన్ని ఓ ఎన్నికల ప్రచార అంశంగా మార్చి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే మా వాళ్లనే ఇరికిస్తారేమోననే భయం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడితే.. ఆయన కింద పనిచేస్తున్న సిట్‌ ప్రభావితమవ్వదా? అని నిలదీశారు. ఇక నిష్పక్షపాత విచారణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేనందున.. దర్యాప్తు సంస్థను మార్చాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు శుక్రవారం తన భర్త రాజశేఖరరెడ్డితో కలసి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలసి ఆమె ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగి వారం రోజులైనా కూడా.. నిందితులు ఎవరనే విషయంఇప్పటికీ బయటకు రాలేదన్నారు. తమ కుటుంబసభ్యులపై మితిమీరిన దృష్టి పెడుతూ అసలైన అనుమానితుల స్టేట్‌మెంట్లను, మెడికల్‌ రిపోర్టులను మార్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. సిట్‌ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేని నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికాని ప్రత్యేక సంస్థ ద్వారా విచారణ జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరాను కలసి.. దర్యాప్తు సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభావితం చేస్తున్న తీరును వివరించారు. దీనిపై స్పందించిన సునీల్‌ ఆరోరా కేసు దర్యాప్తు సంస్థను మార్చడంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలవాలని సూచించారు. 

హైకోర్టు ఆదేశానుసారం తదుపరి చర్యలు..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సూచన మేరకు డాక్టర్‌ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబాను కలసి వైఎస్‌ వివేకా హత్య కేసులో దర్యాప్తు సంస్థను మార్చాలని కోరారు. ఇదే విషయమై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశామని వివరించారు. దీనిపై స్పందించిన రాజీవ్‌ గాబా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూద్దామని సూచించారు. అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సునీత మీడియాకు తెలిపారు. 

మరిన్ని వార్తలు