విద్యాశాఖలో అవినీతి పురుగు!

10 Jan, 2018 08:53 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన విక్టర్‌ ప్రసాద్‌

రీ పోస్టింగ్‌ కోసం లంచం డిమాండ్‌ చేసిన సూపరింటెండెంట్‌

రూ. 20 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విక్టర్‌ప్రసాద్‌

రీ పోస్టింగ్‌ కోసం ఏడేళ్లుగా తిరుగుతున్న బాధితుడు  

చివరకు ఏసీబీని ఆశ్రయించిన వైనం

కె.జమ్మయ్య..గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుండగా సస్పెండ్‌కు గురయ్యారు. రీపోస్టింగ్‌ కోసం ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన శ్రమ ఫలించింది. రీపోస్టింగ్‌ కోసం కావాల్సిన పత్రాలను పంపించాలని విద్యాశాఖాధికారులు సూచించారు. దీంతో డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఎ.విక్టర్‌ప్రసాద్‌ను ఆశ్రయించారు. అయితే చేయి తడిపితేనే ఫైల్‌ కదులుతోందని తెగేసి చెప్పేశాడు. దీంతో చేసేది లేక రూ. 20 వేలు ఇచ్చేందుకు జమ్మయ్య ఒప్పుకున్నారు. ఇప్పటికే ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆయన అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించారు. వారిచ్చిన సలహా మేరకు జమ్మయ్య మంగళవారం సూపరిటెండెంట్‌ విక్టర్‌ప్రసాద్‌కు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. విక్టర్‌ప్రసాద్‌ను బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

శ్రీకాకుళం సిటీ: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం కలకలం రేగింది. లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..

పాతపట్నానికి చెందిన కె.జమ్మయ్య 1984 జనవరి 27న భామిని మండలం గురండి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. తరువాత వివిధ ప్రదేశాల్లో విధులు నిర్వహించారు. ఇతని భార్య విజేత యాగ్రోఫాం ఫైనాన్స్‌ సంస్థలో  ఏజెంట్‌గా పని చేస్తుండేవారు. సంస్థకు, వీరికి మధ్య ఆర్థికపరమైన వివాదాలు తలెత్తాయి. దీంతో జమ్మయ్య కుటుంబంపై ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధులు 2002లో క్రిమినల్‌ కేసు పెట్టారు. దీంతో పోలీసులు జమయ్యను అరెస్టు చేశారు. ఆ సమయంలో చంగుడి ఎంపీ యూపీ స్కూల్‌లో ఎస్జీటీగా జమ్మయ్య పని చేస్తుండేవారు. బత్తిలి పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదవ్వగా, 2003 ఆగస్టు 17ను జమ్మయ్యను అధికారులు సస్పెండ్‌ చేశారు. తిరిగి 2010 నవంబర్‌ 11వ తేదీన జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర అధికారులు జిల్లా విద్యాశాఖను ఆదేశించారు. అయితే అప్పటి నుంచి గతేడాది ఆగస్టు వరకు జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వకుండా శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారులు తాత్సారం చేశారు.

దీంతో జమ్మయ్య తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇప్పటివరకు జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వకపోవడానికి గల కారణాలు తెలిపాలని ఆదేశిస్తూ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. జమ్మయ్యకు ఉద్యోగం ఇవ్వకపోవడానికి అతనికి సంబంధించిన సర్వీసు రిజిస్టర్‌ ఫైల్‌ డీఈవో కార్యాలయంలో కనిపించకపోవడంతో జాప్యం జరిగింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌ నెలలో ఆయనకు చెందిన సర్వీసు రిజిస్టరు ఫైల్‌ దొరికింది. అయితే అతనికి అనుకూలంగా ప్రభుత్వానికి నివేదికను పంపించేందుకు విద్యాశాఖ సూపరింటెండెంట్‌ ఎ.విక్టర్‌ప్రసాద్‌ రూ. 20 వేలు లంచం డిమాండ్‌ చేíశారు. చేసేదిలేక జమయ్య అంగీకరించారు. తరువాత ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జమ్మయ్య నుంచి సూపరింటెండెంట్‌ విక్టర్‌ప్రసాద్‌ లంచంగా 20 వేల రూపాయలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. విక్టర్‌ప్రసాద్‌ను బుధవారం విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్రీనివాసరావు, రమేష్‌  పాల్గొన్నారు.

విసిగిపోయాను
రీ పోస్టింగ్‌ కోసం ఏడేళ్లు నిరీక్షించాను. జాప్యం జరగడంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. తొలుత ఫైలు కనిపించలేదని ఇక్కడి అధికారులు చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఫైల్‌ కనిపించడంతో ఊరట చెందాను. ఇప్పటికే నా కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితిలో రీ పొస్టింగ్‌ కోసం సూపరింటెండెంట్‌ విక్టర్‌ప్రసాద్‌ రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో చేసేది లేక ఏసీబీని ఆశ్రయించాను. – కె.జమ్మయ్య, బాధితుడు

మరిన్ని వార్తలు