రెండో బినామి.. కొరియర్‌ వీరన్న!

22 Nov, 2019 03:19 IST|Sakshi

ఐఎంఎస్‌ కేసులో సూపరింటెండెంట్‌ అరెస్ట్‌

దేవికారాణి కోసం ఫార్మా కంపెనీల నుంచి లంచాల వసూలు

పీఎంజే జ్యువెల్లరీలో రూ.ఆరున్నరకోట్ల నగలకు అడ్వాన్స్‌

అచ్చం మాఫియా తరహాలో.. ఫోన్‌ నంబరుతో నడిపించేశారు

త్వరలోనే మూడో బినామీ అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) మందుల గోల్‌మాల్‌ కేసులో మరొకరు అరెస్టయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 16 మం దిని అరెస్టు చేసిన అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తాజా గా ఐఎంఎస్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌ కె.వీరన్నను అరెస్టు చేసినట్లు గురువారం ప్రకటించింది. కొత్త పేట గ్రీన్‌హిల్స్‌ కాలనీకి చెందిన వీరన్న స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ. మొత్తంగా దేవికారాణికి ఈ భారీ కుంభకోణంలో ముగ్గురు వ్యక్తులు బినామీలు గా వ్యవహరించారు. వారిలో ఒకరైన ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారించిన సంగ తి తెలిసిందే. తాజాగా సూపరింటెండెంట్‌ వీరన్నను కూడా అరెస్టు చేయడంతో మరోసారి కలకలం రేగింది.

కంపెనీల నుంచి డబ్బు తీసుకొచ్చి.. 
ఐఎంఎస్‌లో దేవికారాణి డైరెక్టర్‌గా పనిచేస్తోన్న సమయంలో సూపరింటెండెంట్‌ వీరన్న ఆమె అక్రమాలకు కొరియర్‌గా పనిచేశాడు. జీవో నెం.51ని పక్కనబెట్టిన దేవికారాణి నాన్‌రేటెడ్‌ కంపెనీ (ఎన్‌ఆర్‌సీ)లకు కాంట్రాక్టులను కట్టబెట్టింది. వీటిలో చాలా కంపెనీలు ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నాయి. దేవికారాణి కాంట్రాక్ట్‌ ఇవ్వగానే లాభాలు ఆర్జించాయి. దీనికి ప్రతిగా దేవికారాణికి ప్రతిసారీ రూ.2 నుంచి 5 లక్షల రూపాయలు ముడుపులుగా ముట్టాయి. వీటిని తీసుకువచ్చే బాధ్యత వీరన్నదే. దేవికారాణి ఒక ఫోన్‌నెంబర్‌ ఇస్తుంది. సదరు కంపెనీ ప్రతినిధికి ఫోన్‌ చేసి లక్షల రూపాయల నగదును వసూలు చేసి తీసుకొస్తాడు. వాటిని దేవికారాణి చెప్పినట్లుగా పీఎంజే జ్యువెలరీస్‌కి వెళ్లి అప్పగించేవాడు. ఆ నగదును దేవికారాణి తన నగల ఆర్డర్‌ కోసం ఇచ్చే అడ్వాన్సుగా చూపించేది. అలా ఏకంగా రూ. 6.5 కోట్ల విలువైన నగలను ఆమె పీఎంజే జ్యువెలరీస్‌ నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం.

బినామీ కంపెనీల గుట్టు ఇతనివద్దే.. 
దేవికారాణి బినామీ ఫార్మా కంపెనీల వ్యవహారాల్ని కూడా వీరన్నే నడిపించాడని సహోద్యోగులు ఆరోపిస్తున్నారు. చూడటానికి సాధారణంగా కనిపించే వీరన్న దాదాపు రూ.40 కోట్ల ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. అవన్నీ తన బావ, బావమరుదుల పేరిట రిజిష్టర్‌ చేయించాడని చెబుతున్నారు. ఇతని వద్ద దేవికారాణి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్‌ ఉందని, అందులో బినామీ కంపెనీలతోపాటు, ఎవరు ఎంత చెల్లించారన్న బ్యాలెన్స్‌ షీటు కూడా నిర్వహించాడని సమాచారం. ఇప్పటికే ఇతని ఇంటిపై దాడులు చేసిన ఏసీబీ కుంభకోణానికి సంబంధించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇతను తేజఫార్మా రాజేశ్వర్‌రెడ్డి నుంచి రూ.50 వేలు, ఆరిజిన్‌ ఫార్మాకు చెందిన శ్రీకాంత్‌ గుప్తా నుంచి రూ.3.5 లక్షలు.. మొత్తంగా రూ.4 లక్షలను సొంత బ్యాంకు ఖాతాలకు వేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

రేపోమాపో మూడో బినామీ! 
దేవికారాణికి సంబంధించిన మూడో బినామీ సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌లో పనిచేసే మరో కీలక ఉద్యోగి. ఫార్మా కంపెనీల ద్వారా వసూలు చేసిన డబ్బులతో బీహెచ్‌ఈఎల్, సంగారెడ్డి, గచ్చిబౌలిలో విలువైన స్థలాలు కొనుగోలు చేశాడు. త్వరలోనే ఇతనినీ ఏసీబీ అరెస్టు చేయనుంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా