సుప్రీంకోర్టులో రవిప్రకాశ్‌కు చుక్కెదురు

4 Jun, 2019 01:47 IST|Sakshi

ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ

హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టీకరణ

కేసును మెరిట్‌ ఆధారంగా విచారించాలని ఉన్నత న్యాయస్థానానికి ఆదేశం 

సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరోసారి చుక్కెదురైంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెడుతూ తాజాగా మెరిట్‌ ఆధారంగా కేసును విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్‌ చేస్తూ రవిప్రకాశ్‌ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మాజీ సొలిసిటర్‌ జనరల్‌ రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్లు 160, 41ఏ కింద రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ రవిప్రకాశ్‌ విచారణకు హాజరుకాలేదని వాదించారు. రవిప్రకాశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే పోలీసులు పదేపదే ఆయన ఇంటికొచ్చి సోదాలు చేస్తున్నారని చెప్పగా, అది తప్పుడు విశ్లేషణ అంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్‌ చేశారు. కాగా, సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద పోలీసులు నోటీసులు జారీ చేస్తే తప్పుకుండా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసిన ధర్మాసనం, ఈ కేసులో తాము ముందస్తు బెయిల్‌ ఇవ్వబోమని తెలిపింది. ముందస్తు బెయిల్‌ కోసం తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని చెప్పింది. హైకోర్టు రవిప్రకాశ్‌ బెయిల్‌ పిటిషన్‌ను మెరిట్స్‌ ఆధారంగా విచారణ జరపకుండా కొట్టేయడంతో.. ఈ కేసును హైకోర్టు తిరిగి విచారించాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. జూన్‌ 10న మెరిట్స్‌ ఆధారంగా కేసును విచారించి తేల్చాలని ఆదేశించింది. పోలీసులు ఒకవేళ రవిప్రకాశ్‌ను అరెస్టు చేయదలిస్తే 48 గంటల ముందు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు