ఉరి శిక్ష అవసరం లేదు.. యావజ్జీవం చాలు

17 Jun, 2020 01:10 IST|Sakshi

శ్రీహిత కేసులో సుప్రీంకోర్టు తీర్పు

హైకోర్టు తీర్పుసరైనదేనని వెల్లడి

తీర్పు బాధించిందన్న చిన్నారి తల్లిదండ్రులు

హన్మకొండ చౌరస్తా: తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి శ్రీహితను ఎత్తుకెళ్లి అత్యాచారం, ఆపై హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరి శిక్ష అవసరం లేదని, యావజ్జీవం చాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మొదట ఈ కేసును విచారించిన జిల్లా కోర్టు ఉరి శిక్ష విధించగా.. హైకోర్టు యావజ్జీవ శిక్ష సరిపోతుందని తీర్పు చెప్పింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. వివరాలు.. 2019 జూన్‌ 19న వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని కుమార్‌పల్లిలో పోలేపాక ప్రవీణ్‌.. 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే. అప్పట్లో స్వచ్చంద సంస్థలు, పలు పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. ప్రవీణ్‌ను ఉరి తీయాలని డిమాండ్‌ చేశాయి. కాగా, ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ పకడ్బందీగా ఆధారాలను సేకరించి జిల్లా న్యాయస్థానం ముందుంచారు. అదే ఏడాది ఆగస్టు 8న నిందితుడు ప్రవీణ్‌కు ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరిచింది. దీంతో ప్రజలు సంతోషించారు. (వరంగల్‌ శ్రీహిత హత్యకేసులో తీర్పు)

ఇంతలోనే అనూహ్యంగా హైకోర్టు ప్రవీణ్‌కు ఉరి శిక్ష అవసరం లేదని, యావజ్జీవ శిక్ష సరిపోతుందని తీర్పు చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాదాపు 8 నెలల అనంతరం సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. నిందితుడికి ఉరి శిక్ష విధిస్తేనే సమాజంలో నేరస్తులకు సరైన సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. తుదిశ్వాస విడిచే వరకు జైలు శిక్ష కూడా సరైన సంకేతాలనే సమాజంలోకి పంపుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌తో కూడిన ధర్మాసనం ఈనెల 14న లిఖితపూర్వక ఆదేశాలను విడుదల చేసింది. కాగా సుప్రీం తీర్పు తమను ఎంతో బాధించిందని చిన్నారి శ్రీహిత తల్లిదండ్రులు కామోజు జగన్‌ – రచన ఆవేదన వ్యక్తం చేశారు. పాపపై అఘాయిత్యానికి ఒడిగట్టిన మానవ మృగానికి నిర్భయ దోషుల మాదిరిగా ఉరి శిక్ష వేస్తే న్యాయం జరిగినట్లు భావించే వారమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు