శారదా చిట్‌ఫండ్‌ కేసులో కొత్త మలుపు

17 May, 2019 11:40 IST|Sakshi

శారదా చిట్‌ఫండ్‌ కేసులో కొత్త మలుపు

కోల్‌కతా : శారదా చిట్‌ఫండ్‌ కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక పత్రాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా మాజీ కమిషనర్‌, సీనియర్‌ ఐపీఎస్‌ రాజీవ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. రాజీవ్‌ కుమార్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఆయన కస్టడీపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ.. రాజీవ్‌కుమార్‌ను విచారించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒకవేళ ఆయన విచారణకు సహకరించకపోతే అరెస్ట్‌ చేయవచ్చని సీబీఐకి సూచించింది. దీంతో రాజీవ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీబీఐ సన్నాహాలు చేపట్టింది. మరోవైపు ముందస్తు బెయిల్‌ కోసం రాజీవ్‌ కుమార్‌ వారంలోపు పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

కాగా గతంలో విచారణకు వచ్చిన సీబీఐని మమతా సర్కార్‌ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 15న రాజీవ్‌ కుమార్‌ను ఆ రాష్ట్ర సీఐడీ డీజీ బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. దీంతో ఆయన నిన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రిపోర్టు చేశారు. శారదా గ్రూప్‌ పేరుతో 200 ప్రయివేటు కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70 లక్షలమంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడ్డ విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు