ఇక మీతోనూ వార్‌ చేస్తా!

14 Oct, 2019 10:17 IST|Sakshi
సూరజ్‌ (ఫైల్‌)

ఇప్పటి వరకు పోలీసుల పైనే పోరాడాను

సైబర్‌ క్రైమ్‌ అధికారులతో సూరజ్‌ వ్యాఖ్య

నిందితుడి రిమాండ్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘పోలీసులపై నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తున్నా. ఇప్పుడు మీరు నన్ను అరెస్టు చేస్తున్నారు కదా..! ఇకపై మీ మీదా వార్‌ చేస్తా’... సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఉద్దేశించి ఈ మాటలు అన్నది ఏ తీవ్రవాదో, ఉగ్రవాదో కాదు. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన సీతాఫల్‌మండి వాసి సూరజ్‌ కుమార్‌. ఇటీవల అతడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఇతను ఈ పని చేయడం వెనుక కుట్రలు లేవని, కేవలం ఓ చిన్న వివాదంలో తలదూర్చి, పోలీసులను అపార్థం చేసుకుని అనుచిత వ్యాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన సూరజ్‌కుమార్‌ ఎంసీఏ పూర్తి చేశాడు. కొన్నాళ్లు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేసినా మానేశాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఇతడి ఇంటి సమీపంలో స్థానికులు రోడ్డు పక్కన ఓ ప్రార్థన స్థలం నిర్మించారు. దీంతో సూరజ్‌ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్మాణం చట్ట విరుద్ధమని, తక్షణం కూల్చేయాలంటూ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అది  సున్నితమైన అంశం కావడం, నిర్మాణం అభ్యంతరకంగానూ లేకపోవడంతో పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు.

దీంతో స్థానిక ఏసీపీ, డీసీపీలతో పాటు పోలీసు కమిషనర్‌ వరకు వెళ్ళిన సూరజ్‌ దీనిపై ఫిర్యాదు చేశాడు. ఓ దశలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సైతం లేఖ రాశాడు. ఇవన్నీ పూర్తి కావడానికి మూడేళ్ళు పట్టింది. ఎవరూ తన విషయాన్ని పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో  విచక్షణ కోల్పోయిన సూరజ్‌ కొన్ని రోజుల క్రితం తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో డీజీపీతో పాటు మరికొందరు అధికారులు/అధికారిణు లను ఉద్దేశించి అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై డీజీపీ కార్యాలయం గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ నేతృత్వంలోని బృందం కొన్ని గంటల్లోనే ఛేదించింది. సీతాఫల్‌మండీలోని సూరజ్‌ ఇంటికి వెళ్ళి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అధికారుల్ని ఉద్దేశించి ‘భద్రతా కారణాల నేపథ్యంలో నేను ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నా. నా వివరాలు, చిరునామా మీకు ఎలా తెలిశాయి?’ అంటూ ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా ‘సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు రావాలంటే ముందు నాకు ఫోన్‌ ఇవ్వండి. ప్రతిపక్ష నేతలు, మీడియాతో మాట్లాడిన తర్వాతే మీతో వస్తా. లేదంటే నా భద్రతకు గ్యారెంటీ లేదు’ అంటూ హడావుడి చేశాడు. ఇతడిని సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు తీసుకువచ్చిన అధికారులు వివిధ కోణాల్లో విచారించారు. సూరజ్‌లో మార్పు రావాలనే ఉద్దేశంతో అలాంటి పనులు చేయవద్దని హితవు పలికారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అతను ‘ఇప్పటి వరకు పోలీసుల పైనే యుద్ధం చేస్తున్నా. ఇకపై మీతోనూ (సైబర్‌ క్రైమ్‌ పోలీసులు) వార్‌ చేస్తా’ అంటూ వ్యాఖ్యానించాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు