చిన్నారి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష

27 Dec, 2019 16:13 IST|Sakshi

గాంధీనగర్‌: సూరత్‌లో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుడికి గుజరాత్ హైకోర్టు మరణశిక్ష విధించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడు అనిల్ యాదవ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. బిహర్‌కు చెందిన అతడు సూరత్‌లో నివాసం ఉంటూ గత ఏడాది అక్టోబర్‌లో దారుణానికి ఒడిగట్టాడు. అక్కడ తెలిసిన వారి పాపను ఏడాది క్రితం కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇంట్లోనే లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత చిన్నారిని హతమార్చి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి అక్కడి నుంచి పారిపోయాడు.

తమ కూతురు కనిపించడం లేదని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో మృతదేహం అనిల్ ఇంట్లో ప్లాస్టిక్ సంచిలో ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. తర్వాత అనిల్‌ యాదవ్‌ను పోలీసులు గాలించి పట్టుకున్నారు. కేసు విచారణలో భాగంగా 38 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చిన్నారి మృతదేహానికి జరిపిన వైద్య పరీక్షలు, అటాప్సీని చార్జిషీట్‌లో పొందుపరిచారు. సూరత్‌లో ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో అనిల్ యాదవ్‌కు ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష కూడా విధించింది. స్పెషల్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది.

>
మరిన్ని వార్తలు