‘సూరత్‌’ కేసులో సాయం చేయండి

17 Apr, 2018 09:19 IST|Sakshi

అహ్మదాబాద్‌ : మైనర్‌ బాలికపై పైశాచిక ఘటన వెలుగులోకి వచ్చి 10 రోజులు గడుస్తోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఇప్పటిదాకా చిన్న సాక్ష్యాన్ని కూడా సూరత్‌ పోలీసులు చేధించలేకపోయారు. అసలు బాధిత బాలిక వివరాలు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో  దర్యాప్తు తీరుపై విమర్శలు వినిపిస్తుండగా.. తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామనే సంకేతాలను సూరత్‌ పోలీసులు అందించారు. 

బాధిత బాలిక మృతదేహం ఫోటోలను సూరత్‌ సిటీ పోలీసులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. బ్లూ టీషర్ట్‌ ధరించి ఉన్న ఆ బాలిక వయసు సుమారు 9-11 ఏళ్ల లోపు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ బాలిక గురించి తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని.. తగిన పారితోషకం కూడా అందిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘డీఎన్‌ఏ శాంపిల్స్‌ ద్వారా ఈ కేసును చేధించేందుకు కృషి చేస్తున్నాం. ఘటనాస్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రతీ ఇంటిలో వాకబు చేశాం. ఈ కేసులో మిగతా రాష్ట్రాల సాయం కూడా తీసుకోవాలని నిర్ణయించాం. ఇప్పటికే పిల్లల అదృశ్యాలకు సంబంధించిన 8 వేల కేసులను పరిశీలించాం’ అని సూరత్‌ నగర కమిషనర్‌ సతీశ్‌ శర్మ వెల్లడించారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐ కూడా రంగంలోకి దిగింది.

ఏప్రిల్‌ 6వ తేదీన భేస్తన్‌ ప్రాంతంలోని క్రికెట్‌ మైదానం వద్ద స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పోస్ట్‌ మార్టం నివేదికలో అతి కిరాతకంగా ఆ చిన్నారిని అత్యాచారం చేసి.. హింసించి చంపినట్లు తేలింది. బాలిక ఒంటిపై 86 గాయాలు ఉన్నాయని సూరత్‌ సివిల్‌ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు