తహసీల్దార్‌ హత్య కేసు నిందితుడు మృతి

8 Nov, 2019 02:40 IST|Sakshi
లతను ఓదారుస్తున్న బంధువులు.

పోలీసు భద్రత నడుమ గౌరెల్లికి సురేశ్‌ మృతదేహం తరలింపు

నా భర్తను ఎవరో పావుగా వాడుకున్నారు: సురేశ్‌ భార్య

సాక్షి, హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకేసు నిందితుడు కూర సురేశ్‌ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ నెల 4న విధినిర్వహణలో ఉన్న తహసీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో నిప్పంటుకుని ఆస్పత్రిలో చేరిన డ్రైవర్‌ గుర్నాధం రెండ్రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటు నిందితుడు సురేశ్‌ కూడా ఘటనలో గాయపడిన విషయం విదితమే. గాయాలతోనే సురేశ్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో పోలీసులు ఆరోజే చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సురేశ్‌ ఛాతీ, ముఖం, చేతులు.. ఇలా 65 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల్లో చర్మం కాలిపోవడంతో పాటు మంటల వేడికి రక్తనాళాలు దెబ్బతిన్నాయి.

శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. దీంతో బుధవారం సాయంత్రం సురేశ్‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేశారు. అయితే గురువారం ఉదయమే ఆయన చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఉస్మానియా వైద్యులు సురేశ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. తీరా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సురేశ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. భర్త సురేశ్‌ మరణవార్తతో భార్య లత అస్వస్థతకు గురైంది. ఆమెను అత్యవసర విభాగానికి తరలించి ప్రాథమిక చికిత్సలు అందజేశారు. పోలీసుల భద్రత మధ్య సురేశ్‌ మృతదేహాన్ని సొంతూరు గౌరెల్లికి తరలించారు. అక్కడ రాత్రి భారీ బందోబస్తు మధ్య సురేశ్‌ అంత్యక్రియలు జరిగాయి.

నా భర్త అమాయకుడు: లత  
నా భర్త సురేశ్‌ అమాయకుడు. ఎవరితో గొడవలకు వెళ్లేవాడు కాదు. ఆయనను ఎవరో పావుగా వాడుకున్నారు. ఎమ్మార్వో హత్య కేసులో వెనుకున్న వారెవరో పోలీసులే బయటకు తీయాలని వేడుకుంటున్నా.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా