సీరియల్‌ కిల్లర్‌ ఇంటికి నిప్పు!

1 May, 2019 02:43 IST|Sakshi
కల్పన ఫొటో పట్టుకుని ఘటనాస్థలి వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు

శ్రావణి హత్య ఘటనతో గ్రామస్తుల్లో ఆగ్రహం 

శ్రీనివాస్‌ను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్‌ 

అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై తిరుగుబాటు 

కల్పనను చంపిందీ శ్రీనివాస్‌ రెడ్డే 

కల్పన అస్థికలను బావిలోంచి తీసిన పోలీసులు 

టిఫిన్‌బాక్స్, దుస్తులను ధ్రువీకరించిన కల్పన తల్లిదండ్రులు 

మర్రిబావి వద్ద మిన్నంటిన రోదనలు..భారీగా తరలి వచ్చిన జనం

’సాక్షి, యాదాద్రి/బొమ్మలరామారం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు, సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌ రెడ్డిపై ఆయన సొంతూరు హాజీపూర్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలను హత్య చేసిన శ్రీనివాస్‌ రెడ్డి ఇంటిని గ్రామస్తులు, బాధిత కుటుంబాలు మంగళవారం ధ్వంసం చేశారు. ఇంట్లోని సామాన్లను ఒకదగ్గరికి చేర్చి నిప్పుపెట్టారు.

ఈ నరరూప రాక్షసుడిని బహిరంగంగా ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి ఉన్న ఆస్తిని బాధితులకు పంచాలన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి ఇంటిని ధ్వంసం చేస్తుండగా.. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. గ్రామస్తులు తిరగబడ్డారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతుండడంతో మరింత మంది పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితిని ఓ కొలిక్కివచ్చింది. 

బావివద్ద మిన్నంటిన రోదనలు 
చుట్టుపక్కల ఊళ్లలోని ముగ్గురు బాలికల మృతదేహాలు బయటపడడంతో మర్రిబావి వద్ద బాధితుల రోదనలు మిన్నంటాయి. ఈ అత్యాచారం, హత్య వివరాలు వెల్లడవడంతో.. బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్, మైసిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో బావివద్దకు చేరుకున్నారు. బాధితుడు అత్యంత పాశవికంగా వ్యవహరించిన తీరును ఊహించుకుంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పోలీసులు నాలుగు గంటలపాటు శ్రమించి మర్రిబావిలోనుంచి కల్పన అస్తికలు, ఆమె బ్యాగ్, టిఫిన్‌బాక్స్‌ తదితర వస్తువులను బయటకు తీశారు. 

‘సాక్షి’కథనంపై విచారణలో.. 
మైసిరెడ్డి పల్లికి చెందిన తుంగం కల్పన బొమ్మల రామారం యూపీఎస్‌లో 6 వతరగతి చదువుతోంది. రోజు వారీ మాదిరిగానే పాఠశాల నుంచి ఇంటికి రావడానికి బస్‌కోసం ఎదురచూస్తున్న కల్పనను శ్రీనివాస్‌రెడ్డి బైక్‌పై ఎక్కించుకుని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకు వచ్చి అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు. శ్రావణి హత్య కేసు విచారణ జరుగుతుండగానే.. 2015లో కనిపించకుండా పోయిన కల్పన ఆచూకీ ఏమైందంటూ ‘సాక్షి’లో కథనం వచ్చింది. ఆ దిశగా పోలీస్‌లు విచారణ చేపట్టగా కల్పనపై అత్యాచారం, హత్య విషయాన్ని నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావుతోపాటు పోలీస్, రెవెన్యూ, మెడికల్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 4 గంటలపాటు శ్రమించి మర్రిబావిలోంచి కల్పనకు చెందిన ఎముకలు, దుస్తులు, టిఫిన్‌ బాక్స్‌ను బయటకు తీశారు. కల్పన తల్లిదండ్రులు బావిలో లభించిన దుస్తులు, టిఫిన్‌ బాక్స్‌ తమ కూతురువేనని గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం ఎముకలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు