నయీం కేసులో ఆ ముగ్గురికి ఊరట 

8 Aug, 2018 03:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్‌ అయిన మరో ముగ్గురు అధికారులపై రాష్ట్ర పోలీస్‌ శాఖ సస్పెన్షన్‌ ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సస్పెన్షన్‌లో ఉన్న ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు రాజగోపాల్, మస్తాన్‌వలీ తిరిగి విధుల్లో చేరారు. ఏసీపీ చింతమనేని శ్రీనివాస్‌ మంగళవారం రాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేశారు. అదే విధంగా ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌ నార్త్‌జోన్‌ ఐజీ కార్యాలయంలో, మస్తాన్‌వలీ వెస్ట్‌జోన్‌ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేసినట్లు పోలీస్‌ వర్గాలు స్పష్టం చేశాయి.

సస్పెన్షన్‌కు ముందు ఏసీపీ శ్రీనివాస్‌ నగర కమిషనరేట్‌లోని సీసీఎస్‌లో పనిచేయగా, రాజగోపాల్‌ కొత్తగూడెం ఇన్‌స్పెక్టర్‌గా, మస్తాన్‌వలీ సంగారెడ్డి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. కొద్ది రోజుల క్రితమే అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌రావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావుపై సస్పెన్షన్‌ ఎత్తివేసిన పోలీస్‌ శాఖ.. తాజాగా మిగిలిన ముగ్గురిపై ఎత్తివేయడంతో మొత్తం ఐదుగురు అధికారులు తిరిగి విధుల్లో చేరారు. అయితే వీరిలో ఎవరికి కూడా ఇప్పటివరకు పోస్టింగ్‌లు కేటాయించలేదు. వీరితో పాటు అదనపు ఎస్పీ సునీతారెడ్డి సైతం ఇటీవల పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేసి వెయిటింగ్‌లో ఉన్నారు. పోలీస్‌ శాఖ వీరందరికీ త్వరలోనే పోస్టింగులు కల్పించనున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు