పోలీస్‌స్టేషన్‌ నుంచి వైద్యుడి పరారీ..

14 Feb, 2020 07:46 IST|Sakshi
డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఇంటి గోడకు వైద్య అధికారులు అంటించిన సస్పెన్షన్‌ ఉత్తర్వులు

సస్పెన్షన్‌ వేటు వేసిన ప్రభుత్వం

విచారణాధికారిగా అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ నియామకం  

నెల్లూరు(అర్బన్‌): నర్సులను లైంగికంగా వేధించిన సంఘటనలకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న వైద్యుడు  రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గురువారం తెల్లవారుజామున పోలీస్‌స్టేషన్‌ నుంచి పరారయ్యాడు.  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అతనిని విచారణ నిమిత్తం బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో రాత్రి వరకూ విచారించారు. గురువారం తెల్లవారుజామున మూత్రవిసర్జన కంటూ స్టేషన్‌ బయటకు వచ్చిన డాక్టర్‌ పరారయ్యాడు. ఈ ఘటనపై కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌ విచారణ చేపట్టారు. వైద్యుడి కోసం గాలిస్తున్నామని, స్టేషన్‌లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా డాక్టర్‌ రవీంద్రనాథ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని ఆయన ఇంటి గోడకు అంటించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ శేషగిరిబాబు వైద్యాధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ స్వర్ణలతను విచారణ అధికారిగా నియమించారు. కాగా డాక్టర్‌ రవీంద్రనాథ్‌ వికృత చేష్టలపై ఉదయగిరిలో ఇద్దరు నర్సులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక నర్సు తనను ఆమ్లెట్‌ చేసి తీసుకుని రావాలని కోరి ఇబ్బందులు పాల్జేశాడన్నారు. మరో నర్సు నన్ను ఆపరేషన్‌ థియేటర్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. గతంలో పొదలకూరులో గర్భిణీపై ఇలా అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో కేసు నడుస్తోంది. అదే పొదలకూరులో ఓ నర్సుపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తిరగబడింది. దీంతో ఆమెకు క్షమాపణలు చెప్పి ఆ సంఘటన నుంచి బయటపడ్డాడని తెలిసింది.

కఠిన చర్యలు తీసుకుంటున్నాం:డాక్టర్‌ సుబ్బారావు, డీసీహెచ్‌
ఉదయగిరిలో జరిగిన సంఘటనపై నగరంలోని డీసీహెచ్‌ కార్యాలయంలో జిల్లా ఆస్పత్రిల సమన్వయాధికారి డాక్టర్‌ సుబ్బారావు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పని చేసే ప్రదేశాల్లో నర్సులకు, ఇతర మహిళా సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా  ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. మరో మారు ఇలాంటివి జరగకుండా నిత్యం ఆస్పత్రు లను తనిఖీ చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు