అనుమానాస్పదంగా కార్మికుడి మృతి

16 Jul, 2018 13:41 IST|Sakshi
సితలాపల్లి శివారున పొలాల్లో విగతజీవుడై ఉన్న ఎంకా రెడ్డి

బరంపురం: నగరంలోని సితలాపల్లి గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన ఎంకా రెడ్డి మృతదేహం ఉండడాన్ని గ్రామస్తులు ఆదివారం గుర్తించారు. ఇదే విషయంపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న గోపాల్‌పూర్, చమ్మఖండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమై బరంపురం ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు.

అనంతరం కేసును నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనిపై గోపాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఐఐసీ అధికారి అందించిన సమచారం ప్రకారం.. సితలాపల్లిలో నివాసముంటున్న ఎంకా రెడ్డి తన భార్యతో కలిసి పని కోసం శనివారం గోపాల్‌పూర్‌ వెళ్లాడు. అదే రోజు సాయంత్రం పని ముగించుకుని వ్యాన్‌లో ఇంటికి పయనమయ్యాడు. మార్గం మధ్యలో ఓ బైకుపై వచ్చిన యువకుడితో ఎంకారెడ్డి కలిసి వెళ్ళాడు.

రాత్రి అయినా ఎంకా రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంకారెడ్డికి మొబైల్‌కు ఫోన్‌ చేశారు. ఎంతసేపు ఫోన్‌ చేసినా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం సితలాపల్లి గ్రామ పొలాల్లో విగతజీవుడై ఉన్న ఎంకా రెడ్డిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

పాతకక్షలే కారణం

2014లో జరిగిన జి.గణరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఎంకా రెడ్డి ఆరోపణలు ఎదుర్కొని, ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ హత్య జరగడం పలు అనుమానాలకు తావునిస్తోంది. బండరాయిని తలపై మోది హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం ప్రాథమిక నివేదిక వచ్చాక చెబుతామని పోలీసులు తెలిపారు

మరిన్ని వార్తలు