అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

4 Aug, 2018 13:11 IST|Sakshi
మృతదేహంతో కలెక్టరేట్‌కు వస్తున్న బాధితులు

మల్కన్‌గిరి : జిల్లాలోని ఎంవీ 29 గ్రామంలో గల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అంజని సర్కార్‌(15) అనే బాలిక  అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు మృతదేహంతో ధర్నాకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి ఆశ్రమ పాఠశాల పిల్లలందరూ భోజనాలకు వెళ్లగా అంజని సర్కార్‌ మాత్రం రాలేదు. అది గమనించిన వార్డెన్‌ ఆమె ఎందుకు రాలేదని అడగ్గా తమకు తెలియదని మిగతా విద్యార్థులు సమాధానమిచ్చారు.

దీంతో వార్డెన్‌ అంతా వెతుకుతుండగా చివరికి కంప్యూటర్‌ ల్యాబ్‌ రూమ్‌లో అంజని సర్కార్‌ రక్తపు మడుగులో పడి ఉంది. ఈ దృశ్యం చూసి హతాశురాలైన వార్డెన్‌ అంజని సర్కార్‌ను వెంటనే మల్కన్‌గిరి జిల్లా ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం తెల్లవారు జామున మృతిచెందింది. బాలిక బ్లేడ్‌తో చేతిని కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై మృతిచెందిన అంజని తల్లిదండ్రులు, బంధువులు సుమారు రెండు వందల మంది ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకుని పాఠశాల యాజమాన్యాన్ని నమ్మి తమ బిడ్డను అప్పగిస్తే వారి నిర్లక్ష్యంతోనే చనిపోయిందంటూ ఆగ్రహంతో ఊగిపోతూ మృతదేహంతో కలెక్టరేట్‌కు వెళ్లి ధర్నా చేశారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్‌ మనీష్‌ అగర్వాల్‌ బాధితులతో మాట్లాడుతూ జరిగిన సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.  

మరిన్ని వార్తలు