ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

26 Sep, 2018 01:18 IST|Sakshi
మృతురాలు మనీష( అంతర్‌ చిత్రంలో పాత ఫోటో)

హాస్టల్‌ భవనం వెనుక మృతదేహం లభ్యం

భవనం పైనుంచి పడిపోయిందంటున్న కళాశాల యాజమాన్యం

సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబీకుల డిమాండ్‌

వికారాబాద్‌ పట్టణం గౌతమి కళాశాలలో ఘటన

వికారాబాద్‌ అర్బన్‌: అనుమానాస్పద రీతిలో ఇంటర్‌ విద్యార్థిని మృతిచెందిన సంఘటన వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గౌతమి జూనియర్‌ కళాశాలలో మర్పల్లి మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు శిరీష, మనీష (16)లు బైపీసీ సెకండియర్, బైపీసీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నారు. వీరిద్దరూ కళాశాల హాస్టల్‌లో ఉంటున్నారు. రెండు నెలల క్రితమే మనీష కళాశాలలో చేరింది. కాగా ఎప్పటిలాగే సోమవారం రాత్రి అందరితోపాటు నిద్రపోయిన మనీష తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు గదిలో నుంచి బయటకు వెళ్లినట్లు మృతురాలి అక్క, మిగతా విద్యార్థులు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం స్టడీ అవర్‌ ఉంటుందని, 5 గంటలకు మొదటి బెల్‌ కాగానే బయటకు వెళ్లిన మనీష తిరిగి గదికి రాలేదు.

దీంతో అక్క శిరీషతోపాటు, ఇతర విద్యార్థులు పక్క గదుల్లో వెతికారు. మనీష జాడ కనిపించకపోవడంతో హాస్టల్‌ వార్డెన్‌ అర్చనకు సమాచారం ఇచ్చారు. ఉదయం 6 గంటల సమయంలో రెండో అంతస్తు మీదకు వెళ్లి చూడగా భవనం వెనుకవైపు మనీష కింద పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా మనీష విగతజీవిగా పడి ఉంది. వార్డెన్‌ సమాచారం మేరకు హాస్టల్‌కు చేరుకున్న యాజ మాన్యం మనీషను వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన డాక్టర్లు చనిపోయి మూడు గంటలు అవుతుందని తెలిపారు. కాగా, మనీష తెల్లవారుజామున 5 గంటల తరువాత భవనం పైనుంచి పడిపోయినట్లు వార్డెన్, విద్యార్థులు చెప్పారు.  

మృతిపై పలు అనుమానాలు.. 
మనీష మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతి వార్త తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. రెండు అంతస్తుల భవనం పైనుంచి పడిపోయిన మనీష తలకు, ఇతర శరీర భాగాలకు ఎలాంటి గాయాలు లేకపోవ డం పలు అనుమానాలకు దారితీస్తుందని వారు అన్నారు. ఈ మేరకు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని, ఒత్తిడితోనే మనీష ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థిని ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లారని ప్రశ్నించారు.

సిబ్బందిని విచారించిన పోలీసులు

సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అన్నపూర్ణ, డీఎస్పీ శిరీషలు విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టారు. హాస్టల్‌ వార్డెన్‌తో సహా తోటి విద్యార్థులను ప్రశ్నించారు. మనీష గదిని పరిశీలించారు. తమ కూతురు మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి తండ్రి మాణిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు