హత్యా..? ఆత్మహత్యా..?  

29 Aug, 2018 13:10 IST|Sakshi
సాలమ్మ మృతిపై వివరాలు తెలుసుకుంటున్న సీఐ క్యాస్ట్రోరెడ్డి 

అనుమానాస్పద స్థితిలో మంటల్లోకాలి వృద్ధురాలు మృతి

సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ

గ్రామస్తుల ద్వారా  సమాచారం సేకరణ

రామాంజాపురంలో ఘటన

శాలిగౌరారం (తుంగతుర్తి) : అనుమానస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని రామాంజాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుంకుంది. ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాలి ప్రకారం.. రామాంజా పురం గ్రామానికి చెందిన యల్లంల సాలమ్మ(65) గ్రామంలోని తన సొంతింట్లో ఒంటరిగానే ఉంటుంది. సాలమ్మకు పిల్లలు లేకపోవడంతో పాటు భర్త మల్లయ్య కూడా మూడు సంవత్సరాల క్రితమే మృతిచెందాడు.

సోమవారం రాత్రి ఇంట్లో నింద్రించిన సాలమ్మ మంగళవారం ఉదయం తలుపులు తెరువకపోవడంతో ఆమె అత్త పూలమ్మ వెళ్లి చూడగా తలుపుల రాకపోవడంతో తన మనుమలకు చెప్పింది. దీంతో సాలమ్మ మరిది కుమారులు వెళ్లి తలుపులు తెరిచిచూడగా అప్పటికే సాలమ్మ మంటల్లో పూర్తిగా కాలి మృతిచెంది ఉంది. దీంతో వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చిచూసి పోలీసులకు సమాచారమందించారు.

సాలమ్మ మృతిపై అనుమానాలు..

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సాలమ్మ మంటల్లో కాలి మృతిచెందడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్చయ్య-పూలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో సాలమ్మ భర్త మల్లయ్య పెద్దవాడు కాగా యలమంద చిన్నవాడు. మల్లయ్య-సాలమ్మ దంపతులకు పిల్లలు లేరు. యలమందకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వీరందికి వివాహాలు కూడా జరిగాయి. పిచ్చయ్య-పూలమ్మ సంపాధించిన 20 ఎకరాల వ్యవసాయ భూమిని వారు తన ఇద్దరు కుమారులు మల్లయ్య, యలమందలకు 10 ఎకరాల చొప్పున భాగపంపిణీ చేసి ఇచ్చారు.

మల్లయ్య భాగంగా వచ్చిన 10 ఎకరాల భూమిలో తన పేరుమీద 5 ఎకరాలు, భార్య సాలమ్మ పేరుమీద మరో 5 ఎకరాల భూమిని రికార్డుల ప్రకారంగా నమోదు చేయించుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం మల్లయ్య మృతిచెందడంతో మల్లయ్య పేరున ఉన్న భూమిని యలమంద తన పేరున మార్చుకున్నారు. ప్రస్తుతం సాలమ్మ పేరున ఉన్న భూమిని కూడా యలమంద కుటుంబీకుల ఆదీనంలోనే ఉంది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాలమ్మ బాగోగులను యలమంద కుటుంబీకులే చూసుకుంటున్నారు.

వారం రోజులక్రితం సాలమ్మ తనవద్ద ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలను దాచిపెట్టమని అదే గ్రామానికి చెందిన అన్న కత్తుల మల్లయ్యకు ఇచ్చింది. బంగారు ఆభరణాలను దాచిపెట్టిన విషయం తెలుసుకున్న యలమంద కుటుంబీకులు సాలమ్మను బాగోగులు చూసుకోకుండా బంగారు ఆభరణాలు తీసుకురావాలంటూ మానసిక ఒత్తిడికి గురి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే సాలమ్మ ఇంట్లో మంట ల్లో కాలిపోయి చనిపోవడం అనేక అనుమానాల కు తావిస్తోంది. పెద్దగా ఉన్న ఒకే ఇంటిలో ఒక భాగంలో యలమంద కుటింబీకులు, రెండో భాగంలో సాలమ్మ, మూడో భాగంలో సాలమ్మ అత్తమామలు ఉంటున్నారు.

మంటల్లో కాలిపోతున్న సమయంలో సాధారణంగా వ్యక్తులు కేకలు వేస్తారు. లేదా అటుఇటు పరుగులు పెడతారు. ఒకవేళ కేకలు వేస్తే పక్కన ఉన్న యలమంద కుటింబీకులకుగానీ, అత్తమామలకుగానీ వినపడలేదా..? సాలమ్మ ఇంట్లో ఓ మూలన పూర్తిగా కాలిపోయి మృతిచెంది ఉంది. ఒకపక్క అనారోగ్య సమస్యలు.. మరోపక్క ఆలనాపాలనా చూసేవారు పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఆస్తికోసం ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా..?

అనే అనుమానాలకు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.  ఈ క్రమంలో సాలమ్మ అన్న కత్తుల మల్లయ్య పోలీసులకు యలమంద కుటుంబీకులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. మల్లయ్య పిర్యాదు మేరకు ఎస్‌ఐ గోపాల్‌రావు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ

మండలంలోని రామాంజాపురంలో అనుమానస్పద స్థితిలో వృద్ధురాలు మంటల్లోకాలి మృతిచెందిన విషయం తెలుసుకున్న శాలిగౌరారం సీఐ క్యాస్ట్రోరెడ్డి ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సాలమ్మ మృతదేహన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాలమ్మ మృతిపై గ్రామస్తులను కూడా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు